ఈవారంలో రిలీజ్ చేయడానికి అంతా రెడీ అనుకున్నా కానీ ‘పవర్’ని టైమ్‌కి రిలీజ్ చేయలేకపోవడంతో వారం రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. రభస కలెక్షన్లు వీక్‌గా ఉండడంతో ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయడానికి ఈ వీక్ బెస్ట్ టైమ్. పవర్ లేకపోతే ఈవారంలో చెప్పుకోతగ్గ మరో కొత్త సినిమానే లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వచ్చే వారంలో రావడం వల్ల పవర్‌కి చాలా తలనొప్పులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 19న ‘ఆగడు’ రిలీజ్ కన్‌ఫర్మ్ కావడం వల్ల ‘పవర్’ ఎంత కలెక్ట్ చేసినా అది వారం రోజుల్లోపే జరిగిపోవాలి. ఆ తర్వాత ‘ఆగడు’ ధాటిని తట్టుకుని ఈ చిత్రం ఏమాత్రం నిలబడుతుందనేది చెప్పడం కష్టమే. అసలే రెండూ మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసిన పోలీస్ చిత్రాలే.
‘ఆగడు’ చిత్రాన్ని మాసివ్‌గా రిలీజ్ చేయబోతున్నారు కనుక వారం రోజుల్లోనే పవర్ థియేటర్లలో చాలా వరకు త్యాగం చేసేయాలి. రెండవ వారం నుంచి పవర్‌కి థియేటర్లు ఎక్కువ ఉండవు కనుక షేర్లు కూడా పెద్దగా రావు. అసలే భారీ బడ్జెట్ చిత్రమని అంటున్నారు కనుక ఇది మంచి సైన్ కాదు. పైగా ఆగడు తర్వాత వారానికో పెద్ద సినిమా చొప్పున రిలీజ్ అవుతూనే ఉంటాయి కనుక సెప్టెంబర్ 5 డేట్‌ని మిస్ చేసుకోవడాన్ని పవర్ మేకర్స్ చాన్నాళ్లు రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది.