అజ్ఞాతవాసి.. అసలు రీజన్ ఇదేనా?

అజ్ఞాతవాసి సినిమా పరాజయం అంత డిస్కషన్ పాయింట్ ఇటీవల టాలీవుడ్ లో మరొకటి లేదు. ఎందుకంటే ఈ సినిమా మీద అంచనాలు ఆ విధంగా వుండడం ఒక్కటే కాదు. దాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…

అజ్ఞాతవాసి సినిమా పరాజయం అంత డిస్కషన్ పాయింట్ ఇటీవల టాలీవుడ్ లో మరొకటి లేదు. ఎందుకంటే ఈ సినిమా మీద అంచనాలు ఆ విధంగా వుండడం ఒక్కటే కాదు. దాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం కూడా. ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కటి కూడా అర్థం పర్థం లేని సినిమా తీయలేదు. అలాంటిది ఇప్పుడు అజ్ఞాతవాసి ఇలా ఎందుకు తీసారన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

అజ్ఞాతవాసి ఇలా తయారుకావడం వెనుకు ఓ అసలు సిసలు రీజన్ వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అదేమిటంటే సినిమా రా ప్రొడక్ట్. ఏ సినిమాకు అయినా స్క్రిప్ట్ కు అదనంగా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఎక్కువ షూట్ చేసారు. ఏ ఒకరిద్దరో మాత్రమే అతి తక్కువ వేస్టేజ్ తో మేనేజ్ చేస్తారు. అయితే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి మేధావి వర్గ దర్శకులు మాత్రం, ముఫై నుంచి నలభై శాతం వరకు అదనంగా తీస్తారు. అంతా ఎడాపెడా తీసేసి, ఆఖరికి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుస్తీ పడతారు.

అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ తీసిన ఫుటేజ్ నాలుగు గంటల వరకు వచ్చినట్లు బోగట్టా. ఆ నాలుగు గంటల పుటేజ్ ను దగ్గర దగ్గర మూడు గంటలు చేసారు. అంటే గంట ఫుటేజ్ పక్కన పెట్టేసారు. గంట ఫుటేజ్ అంటే చిన్న విషయం కాదు. ఎన్ని సీన్లు వుంటాయో? ఎంత కీలకమైన సీన్లు వుంటాయో? ఆలోచిస్తేనే ఆసక్తిగా అనిపిస్తుంది.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, జనవరి 9డేట్ ప్రకటించేసిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు త్రివిక్రమ్ చాలా కిందా మీదా అయిపోవాల్సి వచ్చింది ముంబాయిలో డిఐ, గ్రాఫిక్స్.. చెన్నయ్ లో రీ రికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్, హైదరాబాద్ లో ఎడిటింగ్. వీటిలో త్రివిక్రమ్ ఎక్కువ సమయం కేటాయించింది చెన్నయ్ లో రీ రికార్డింగ్ కు, డిటీఎస్ మిక్సింగ్ కు. ఆ పనిలో పడి ఇటు ఎడిటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలిసింది. త్రివిక్రమ్ నెరేషన్, సూచనల ప్రకారం ఎడిట్ చేసి పెట్టేసినట్లు తెలుస్తోంది. 

ఇలా పని వత్తిడి, హడావుడి ఎడిటింగ్, గంట ఫుటేజ్ మిగిలిపోవడం వల్ల సినిమాలో కాస్త కంటిన్యూటీ సమస్యలు, పాత్రలకు పరిపూర్ణ ఎండింగ్ వంటి సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు అజ్ఞాతవాసి సినిమా పరాజయానికి ఇధో కారణం.