మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు రెడ్డి వర్గం నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. రాజకీయాలు, పార్టీల వంటి మిగతా విషయాలు ఎలా ఉన్నా సినిమా విషయంలో మాత్రం రెడ్డి వర్గం నుంచి చిరంజీవికి గట్టి సపోర్ట్ అందుతోంది. సినిమా ఫస్ట్‌లుక్, పోస్టర్లను అటు చిరంజీవి అభిమానుల కంటే ఎక్కువగా రెడ్డి కులస్తులు ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర పోరాటంలో ఎన్నో ధైర్యసాహసాలు ప్రదర్శించి రాయలసీమ ఖ్యాతిని దేశానికి చాటిచెప్పిన మహాయోధుడి మీద తమకున్న అభిమానాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారు.
సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగానే తెల్లోల్ల తలలు తెగనరికిన యోధుడు ఉయ్యాలవాడ. రాయలసీమ ప్రాంతంలో ఆయన పోరాటాల్ని కథలు, కథలుగా చెప్పుకుంటారు. రెడ్డివర్గ ఖ్యాతిని పెంచిన వ్యక్తుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అందులో ఉయ్యాలవాడ పేరు ప్రముఖంగా ఉంటుంది. పౌరుషానికి ఉయ్యాలవాడ పెట్టింది పేరు. తామెంతో గొప్పగా భావించే ఇలాంటి పోరాటయోధుడి జీవిత చరిత్రను సినిమాగా తీస్తుండడం, అందులో చిరంజీవి లాంటి ఛరిష్మా ఉన్న నటుడు ఉయ్యాలవాడ పాత్రను పోషిస్తుండడం రాయలసీమ రెడ్లను అమిత ఆనందానికి గురిచేస్తోంది. చిరంజీవి ఉయ్యాలవాడ పోస్టర్లను ఆ వర్గ యువత సోషల్‌మీడియాలో విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది.
సహజంగానే రెడ్డి వర్గంలో చిరంజీవి అభిమానులే ఎక్కువ.. రాజకీయాలు ఎలావున్నా ఆయన సినిమాలను మాత్రం వారు బ్రహ్మాండగా ఆదరిస్తారు. దానికి తోడు తమ నాయకుడి గురించే ఇప్పుడు చిరంజీవి సినిమా తీస్తుండడంతో ఆయన పట్ల పాజిటివ్నెస్ పెరిగింది. అందుకే సినిమా ప్రారంభం కాకముందు నుంచే పబ్లిసిటీ కల్పిస్తున్నారు. ఇక మన సమాజంలో సినిమాలపై కుల ప్రభావం గురించి కొత్తగా చెప్పదేముంది. ఏ వర్గానికి చెందిన యువత అదే వర్గం హీరోకి వీరాభిమానులుగా మారే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నదే కదా. ఇలా అటు రెడ్డి వర్గం, ఇటు మెగా అభిమానులు ఉయ్యాలవాడకి బోలెడు పబ్లిసిటీ కల్పిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. సినిమా యూనిట్‌ను ఈ విషయం తెగ సంతోష పెడుతోంది కూడా.
మరి సినిమా విడుదల వరకూ ఉయ్యాలవాడకు రెడ్డి వర్గం మద్దతు ఇలాగే కొనసాగితే మిగిలిన ప్రాంతాల సంగతెలా ఉన్నా రెడ్ల ప్రాభవం ఉన్న రాయలసీమ, తూర్పు రాయలసీమ, దక్షిణ తెలంగాణలో సినిమా అఖండ విజయం సాధించడం మాత్రం ఖాయంగా చెప్పవచ్చు.