రక్తం రుచి మరిగిన పులి అంటారే…అలా వున్నట్లుంది ఆర్జీవీ వ్యవహారం. కాస్త పోర్నో టచ్ తో ప్రోమోలు వదిలితే చాలు, కుర్రకారు చొంగలు కార్చుకుంటే డబ్బులిచ్చేస్తారు అని డిసైడ్ అయిపోయినట్లుంది. ఆ మధ్య పే ఫర్ వ్యూ అంటూ వంద రూపాయల టికెట్ మీద క్లయిమాక్స్ అనే సినిమా వదిలారు. జనం ఎగబడ్డారు. డబ్బు వచ్చి పడింది.
కానీ చూసిన వాళ్లంతా, ట్రయిలర్ లో వున్నదే తప్ప సినిమాలో ఏముందీ అని పెదవి విరిచారు. 100 రూపాయలు వృధాపోయాయి అని బాధపడిన వారూ వున్నారు. అలా ఆ వ్యవహారం ముగిసింది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో రెడీ అయిపోయారు ఆర్జీవీ. నగ్నం అనే పేరు పెట్టి, మూడు భాషల్లో ఈసారి ఏకంగా రెండు వందలు టికెట్ పెట్టి వదులుతున్నారు. ఈనెల 27న విడుదల చేస్తున్నారు.
మొదటి రోజే మాగ్జిమమ్ రాబట్టేయాలనో, మొదటి రోజు చూసిన వారి ఫీడ్ బ్యాక్ తో, రెండో రొజు జనం చూడరేమో అన్న అనుమానం కూడా వుందేమో? అందువల్ల ఈసారి ఏకంగా మూడు ప్లాట్ ఫారమ్ ల మీద విడుదల చేస్తున్నారు. క్లయిమాక్స్ చూసిన వారిలో సగం మంది ఈసారి నగ్నం చూసినా, మళ్లీ ఆర్జీవీకి డబ్బులే డబ్బులు. అప్పుడు వంద, ఇప్పుడు రెండు వందలు కదా?