సంక్రాంతి కాదు కదా.. భోగి పండుగ కూడా ఇంకా రాలేదు. కానీ సంక్రాంతి సీజన్ లు అప్పుడే మసకబారిపోయాయి. సంక్రాంతి సీజన్ అంటే.. పండగ తర్వాత మరో నెల రోజుల వరకూ అదే ఊపు మీద ఉండాల్సిన తెలుగు చిత్ర పరిశ్రమ.. భోగి రాకముందే తుస్సుమంది. ఈ సీజనుకోసం ఆగి మరీ విడుదలైన చిత్రాలు మూడు. వీటిలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు రెండే. ఈ రెండూ నిరాశపరచగా, డబ్బింగ్ చిత్రం గ్యాంగ్ మాత్రం.. అంతో ఇంతో ప్రేక్షకులను మెప్పిస్తోందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో.. ఈ సంక్రాంతి విడుదలగా ప్రజల ముందుకు రావడానికి మరో చిన్న సినిమా కూడా ఉత్సాహపడుతోంది… అదే అక్కినేని నాగార్జున నిర్మాతగా రాజతరుణ్ హీరోగా రూపొందిన ‘రంగులరాట్నం’! భారీ సినిమాలు నిరాశ పరచడంతో ఇది రైట్ టైం అని.. అక్కినేని నాగార్జున ఈ సమయంలో గేరప్ అయి.. సినిమా ప్రచారానికి కొంత సమయం కేటాయిస్తే.. సినిమాకు ప్లస్ అవుతుందని రంగులరాట్నం కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారట.
రంగులరాట్నం సినిమా విడుదల కాబోతున్నది గానీ.. ఇలాంటి సమయంలో ఒక నిర్మాత ఉండాల్సినంత చురుగ్గా నాగార్జున వ్యవహరించడంలేదనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో.. ఒక సినిమా ఫ్లాప్ అయ్యాక.. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మరో సినిమా విడుదల హక్కులను అయినకాడికి తెగనమ్మడం అనే సంస్కృతి బాగానే వస్తోంది. ఆ సిద్ధాంతం ప్రకారమే తన నిర్మాణ సంస్థలోనే చిన్న కొడుకు అఖిల్ హీరోగా చేసిన ‘హలో’ చిత్రం హక్కులు కొనుక్కుని చేతులు కాల్చుకున్న డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఉపశమన చర్యల్లాగా ‘రంగులరాట్నం’ హక్కులు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.
అయితే నాగార్జున మాత్రం విడుదల విషయంలో ఒకసారి ప్రెస్ మీట్ చిత్ర ప్రమోషన్ కు కాస్త హెల్ప్ అయ్యారు. అయితే రెండు భారీ చిత్రాలు విడుదల తర్వాత.. ఆ రెండూ బాక్సాఫీసు వద్ద నీరసంగా ఉన్న సమయంలో.. నాగార్జున కాస్త గేరు మార్చి.. తన సొంత సినిమా గురించి ఎక్స్ ట్రా ప్రమోషన్ కు శ్రద్ధ తీసుకుంటే.. రంగులరాట్నం ఓపెనింగ్స్ కూడా చాలా బాగుండే అవకాశం ఉన్నదనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలే కాంపెన్సేషన్ కింద అమ్మేసిన సినిమా.. ఇక దాని బాగోగుల సంగతి నాకెందుకు అనుకోకుండా.. నాగార్జున కాసింత శ్రద్ధ తీసుకుంటే మంచి జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.