రోబో 2..0 డేట్ మారకుంటే..?

రోబో 2.0 సినిమా జనవరి 25న విడుదలవుంది. ఇది ఇప్పటికి వున్న డేట్. కానీ ఆ డేట్ కు విడుదలైతే తెలుగునాట కష్టం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఎందుకంటే డిసెంబర్ ఆఖరి నుంచే…

రోబో 2.0 సినిమా జనవరి 25న విడుదలవుంది. ఇది ఇప్పటికి వున్న డేట్. కానీ ఆ డేట్ కు విడుదలైతే తెలుగునాట కష్టం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఎందుకంటే డిసెంబర్ ఆఖరి నుంచే తెలుగు సినిమాల తాకిడి ప్రారంభం అవుతోంది.

రామ్ చరణ్-సుకుమార్ ల రంగస్థలం, పవన్-త్రివిక్రమల మూవీ, కొరటాల శివ-మహేష్ ల భరత్ అనే నేను, సినిమాలు ఇప్పటికే సంక్రాంతికి ఫిక్సయిపోయి వున్నాయి. ఇవి కాక బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమా కూడా వస్తుందంటున్నారు. మరి పండగ సినిమాలు ఏవీ కూడా కనీసం నాలుగు వారాలు థియేటర్లను వదలవు. 

మొన్నటికి మొన్న ఆగస్టు 11న మూడు సినిమాలు విడుదలయ్యాయి. రెండు వారాలు దాటినా అవే థియేటర్లను వదలడం లేదు. అలాంటిది పెద్ద సినిమాలు, అది కూడా పండగ టైమ్ లో థియేటర్లను వదుల్తాయా? పైగా అవి చిన్న సినిమాలు కాదు, తీసి పక్కన పెట్టడానికి. పెద్ద సినిమాలు. ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఓ రేంజ్ లో వుంటుంది. 

అందువల్ల 25న రోబో 2 విడుదలయితే, థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయి?  పైగా రోబో 2 చిన్న సినిమా కాదు. తెలుగు రాష్ట్రాల్లో 72కోట్లకు హక్కులు అమ్ముడుపోయిన సినిమా. (81కోట్లకు ఆసియన్ సునీల్ తీసుకున్నారని వార్తలు వినవస్తున్నాయి కానీ, అసలు రేటు 72కోట్లు అని గుసగుసలు వినిపిస్తున్నాయి)  ఎలా లేదన్నా రెండు రాష్ట్రాల్లో కలిసి 120కోట్ల మేరకు వసూళ్లు సాగిస్తే తప్ప, ఈ ప్రాజెక్టు అమ్మకాలు, కొనుగోళ్లలో పార్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు బ్రేక్ ఈవెన్ కారు. ఆ రేంజ్ వసూళ్లు సాగించాలంటే కేవలం బ్లాక్ బస్టర్ టాక్ మాత్రమే కాదు, ఫస్ట్ వీక్ లో మాగ్జిమమ్ లాగేయగలనన్ని థియేటర్లు కూడా కావాలి.

ఆసియన్ సంస్థకు నైజాం వరకు థియేటర్లు ఓకె. ఆంధ్ర దగ్గరకు వచ్చేసరికి సురేష్ సంస్థ ఆదుకోవచ్చు. అయినా కూడా పెద్ద సినిమాలు మూడింటిని కాదని థియేటర్లు ఎలా వుంచుకోగలరో చూడాలి. అదే కనుక కాస్త గ్యాప్ ఇచ్చి వస్తే మాత్రం 120కోట్ల బిజినెస్ పెద్ద సమస్య కాదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.