ఒక్కక్షణం చాలు, టేబుల్ టర్న్ అయిపోవడానికి. ఒక్క ఆలోచన చాలు మనసు మారిపోవడానికి. ఒక్క సినిమా చాలు వైరాగ్యం పుట్టేసి, సినిమా లోకం వదిలి జన జీవన స్రవంతిలోకి చేరిపోవడానికి.
పక్షి విరహం, బాధ చూసి, బోయవాడు వాల్మీకి అయిపోయి రామాయణం రాసేసాడు. ఓ సిఎమ్ ప్రమాణ స్వీకార ఫంక్షన్ కు వెళ్లి ఆ వైభొగం చూసి, తాను రాజకీయాల్లోకి రావాలని ఓ పేద్ద హీరో రంగంలోకి దిగి సిఎమ్ అయిపోయాడు గతంలో.
అన్న వైఫల్యం చూసి, తమ వాళ్లే, తమ చోటే అనుకున్న చోట దెబ్బేసిన తీరుచూసి, వాళ్లను ఇలా కాదు, డీల్ చేయాల్సింది, నేను డీల్ చేసి చూపిస్తా అనే టైపులో జనసేన అంటూ రంగంలోకి దిగినట్లుంది పవన్ కళ్యాణ్.
నిజానికి పవన్ కళ్యాణ్ టాప్ హీరో. క్రేజీ హీరో. పవర్ స్టార్. పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో. పాతిక కోట్లు అంటే పా…తి…క..కోట్లు. ఏడాదికి రెండు సినిమాలు చేసినా చాలు. యాభై కోట్లు వచ్చి పడతాయి. ఇంకా కనీసం మరో అయిదు ఆరు సినిమాలు చేయగల వయసు వుంది. చరిష్మా వుంది. గ్లామరూ వుంది. అంటే సుమారు మరో నూరు నూటా యాభై కోట్లు.
అలాంటిది అవన్నీ వదలుకుని, అజ్ఞాతవాసిని కాస్తా జనవాసిని అయిపోయాడు. ఇంక సినిమాలు చేయాలన్న ఆసక్తిలేదు, ప్రజా రాజకీయాలే పరమావధి అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఈ మార్పుకు కారణం ఏమిటి? ఈ వైరాగ్యానికి కారణమెవ్వరు?
ఇంకెవ్వరు ఘనత వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అనుకోవాలి.
నిజానికి పవన్ కు సినిమాల మీద ఆసక్తి లేదు అని అనడానికి లేదు. అలా అయివుంటే, ఇద్దరు నిర్మాతలు ఎఎమ్ రత్నం, మైత్రీ మూవీస్ దగ్గర అడ్వాన్స్ లు ఎందుకు తీసుకుని వుంటారు? రెండు తమిళ సినిమా రీమేక్ హక్కులు తీసుకోమని చెప్పి, ఇద్దరు దర్శకుల చేత వాటికి రిపేర్లు చేయించి, వాళ్లను అలా లైన్ లో ఎందుకు వుంచుతారు.
ఇన్నీ చేసి, ఇప్పుడు తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేసి, ఇక సినిమాలు చేయరేమో అన్న అనుమానం వచ్చేలా నిన్నటికి నిన్న ఎందుకు మాట్లాడారు? ఇదంతా జనం, రాజకీయాల మీద ఆసక్తి అనుకోవాలా? కాదు. ఎందుకంటే గత మూడేళ్లుగా ఆయన రాజకీయాల్లోనే వున్నారు. జనం దగ్గరకి అడప దడపా వెళ్లి వస్తూనే వున్నారు.
అదే విధంగా ఆయన తన రెండు వ్యవహారాలు కొనసాగించుకోవచ్చు. లేదూ ఇప్పడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అని అంటారేమో? ఇంకా కనీసం పది పదకొండు నెలల దూరం వుంది. అందువల్ల కనీసం.. కనీసంలో కనీసం.. ఒక్క సినిమా అయినా చేయచ్చు.
అయినా చేసే ఆలోచన వున్నట్లు కనిపించడం లేదు?
ఎందుకు.. ఎందుకు? సింపుల్ ఆన్సర్. అజ్ఞాతవాసి పరాజయం ఆయనను అంత కార్నర్ కు నెట్టేసింది కనుక. అజ్ఞాతవాసి సినిమా ఆయన భవిష్యత్ సినిమా ఆలోచనను పూర్తిగా మార్చేసింది కనుక.
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడే తనతో సరైన సినిమా తీయలేనపుడు, చేయలేనపుడు, ఇంక ఏ దర్శకుడు మాత్రం చేయగలుగుతాడు అన్న ఆలోచన మొలకెత్తి వుండొచ్చు. రాజకీయాలంటే జనాలకు ఫ్రీ వ్యవహారం. ఫ్రీగా నటులను చూడొచ్చు, ఫ్రీగా సభలకు వెళ్లొచ్చు. ఫ్రీగా ప్రభుత్వాల దగ్గర నుంచి పథకాలు పొందొచ్చు. పైగా ఓటేయడానికి వాళ్లే రివర్స్ లో డబ్బులిస్తారు.
కానీ సినిమా అలా కాదు. మామూలు రేటుకన్నా ఎక్కువ పెట్టి టికెట్ ‘కొని’ చూడాలి. అందుకే పవన్ అయినా, మరొకళ్లు అయినా సినిమా బాగాలేకుంటే పక్కన పెట్టేస్తారు. ఇలాంటి వ్యవహారంలో పవన్ రిస్క్ ఎందుకు చేయడం. అదే తానే వాళ్ల దగ్గరకు వెళ్తే బొలోమని వస్తారు. చూస్తారు. ఆ జన సందోహం, ఆ బల ప్రదర్శన తన జనసేనకు పునాది, తన పార్టీతో ఇతర పార్టీలకు ఒప్పందాలుగా వాడుకోవచ్చు.
ఇలాంటి ఆలోచనకు దారితీసేలా చేసింది అజ్ఞాతవాసి. అలాంటి అజ్ఞాతవాసిని అందించింది త్రివిక్రమ్. ఏమైనా నిర్మాతలకు, అభిమానులకు అన్యాయం చేసినా, పవన్ ను సరైన బాటలో నడిచేలా చేసింది మాత్రం త్రివిక్రమ్ నే. శహభాష్ అనాలేమో?
-ఆర్వీ