రాంగ్ రూట్లో సాయి ధరమ్

సినిమా కెరీర్ స్టార్ట్ చేయడం ఎంత కష్టమో, నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం. వారసత్వం, గాడ్ ఫాదర్లు ఇవన్నీ కొంతవరకే సహకరిస్తాయి. టైమ్ కలిసిరావాలి. సరైన సినిమాలు పడాలి. అప్పుడే వ్యవహారం గాడిలో పడుతుంది. హీరో…

సినిమా కెరీర్ స్టార్ట్ చేయడం ఎంత కష్టమో, నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం. వారసత్వం, గాడ్ ఫాదర్లు ఇవన్నీ కొంతవరకే సహకరిస్తాయి. టైమ్ కలిసిరావాలి. సరైన సినిమాలు పడాలి. అప్పుడే వ్యవహారం గాడిలో పడుతుంది. హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఈ విషయంలోనే కిందా మీదా అవుతున్నాడు. నిర్మాతలు వున్నారు. దర్శకులు వున్నారు. ఫ్యాన్స్ బ్యాకింగ్ వుంది. కానీ సరైన సినిమా పడడం లేదు.

అందుకే సాయి ధరమ్ ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు. వివి వినాయక్ లాంటి పెద్ద డైరక్టర్ తో సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదలవుతున్నా, టెన్షన్ ఫ్రీ కాలేకపోతున్నాడు. ఈ సినిమా ఏమవుతుందో? దీని తరువాత ఎలాగైనా మరో మాంచి ప్రాజెక్ట్ చేయాలని సంప్రదింపులు సాగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

ఈ సినిమా తరువాత గీతాలో మారుతి డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంది. అలాగే టాగోర్ మధుకు మరో సినిమా చేయాలనివుంది. కానీ దానికి డైరక్టర్, కథ కావాలి. వినాయక్ లాంటి పెద్ద డైరక్టర్ తో సినిమా చేస్తూ కూడా సాయి ధరమ్ ఎందుకు కిందా మీదా అయిపోతున్నారో అన్నది అనుమానంగా వుంది.

మరోపక్క సినిమాకు బజ్ తీసుకురావాలని, ఓపెనింగ్స్ రాబట్టాలని కూడా సాయి ధరమ్ తెగ తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే మెగా ఫ్యాన్స్ ను సమీకరించాలని, బుజ్జగించాలని, మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బహరింగ లేఖలు రాస్తున్నారు.

కానీ ఇలా విడుదలకు ముందు కిందా మీదా అయ్యే కన్నా, యంగ్ న్యూ కమింగ్ డైరక్టర్లను పట్టుకోవడం, వాళ్ల దగ్గర నుంచి మంచి విభిన్నమైన కథలు తెచ్చుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టడం అవసరం.

మిగిలిన యంగ్ హీరోలంతా కొత్త కొత్త కథల వైపు చూస్తుంటే, సాయి ధరమ్ మాత్రం రొడ్డకొట్టుడు మాస్ కథల వైపు చూస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్, యూత్ ఫుల్ సబ్జెక్ట్ లు పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇలా విఫలమవుతూ, సినిమా విడుదల ముందు మాత్రం ఇలా ఫ్యాన్స్, మెగా లెగసీ అంటూ అక్కర్లేని రూట్ లో ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా బాగులేకుంటే ఫ్యాన్స్ మాత్రం ఏం చేస్తారు. అజ్ఞాతవాసిని పవన్ కు వున్న భయంకరమైన ఫ్యాన్ బేస్ ఏమాత్రం కాపాడగలిగింది.

సాయి ధరమ్ ఈ దిశగా ఆలోచించి, అక్కర్లేని వాటిపై కన్నా, అవసరమైన కథ, కథనాలపై దృష్టి పెట్టి, తన రూట్ మార్చుకోవాలి. అప్పుడే నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, నిఖిల్ ఇలా వీళ్ల కోవలోకి వస్తాడు. లేదంటే, మాత్రం కెరీర్ కొనసాగింపు కష్టమే.