మెగాస్టార్ మెగా మూవీ సైరా మీద ఉన్నట్లుండి బోలెడు వార్తలు వినిపించండం ప్రారంభమైంది. కోర్టులో వాదనలు జరిగాయని, ఇది బయోపిక్ కాదని, దర్శకుడు సురేంద్రరెడ్డి కోర్టులో వాగ్మూలం ఇచ్చారని, సెన్సారు అధికారులు ఇంకా సర్టిఫికెట్ ఇవ్వలేదని, బాలీవుడ్ సెన్సారు కాలేదని, ఇలా చాలా చాలా.
మరోపక్క హిందీ భారీ సినిమా వార్ హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి ప్రాంతాల మల్టీ ఫ్లెక్స్ ల విషయంలో గట్టి పట్టుపడుతోందని, తమ సినిమాకు కూడా సగం స్క్రీన్ లు కేటాయించాలని లేఖలు రాసిందని వార్తలు వినవచ్చాయి. వార్ సినిమా నిర్మించిన యష్ రాజ్ సంస్థ కూడా పెద్దదే. దాని మాటను మల్టీ ఫ్లెక్స్ లు అంత సులువుగా తోసేయలేవు. దాంతో మల్లగుల్లాలు, డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. దాంతో ఇప్పటి వరకు హైదరాబాద్ లో కీలకమైన స్క్రీన్లకు ఆన్ లైన్ బుకింగ్ స్టార్ట్ కాలేదు.
ఇదిలావుంటే సాయంత్రానికి సైరా తెలుగు వెర్షన్ కు సర్టిఫికెట్ వచ్చింది. దీన్ని బేస్ చేసకుని, హిందీ వెర్షన్ ను డబ్బింగ్ గా చూపించి, అక్కడ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి వుంది. ఆ కార్యక్రమం రేపు చేపడతారని తెలుస్తోంది. రేపు ఆ ఫార్మాలిటీలు పూర్తికావాల్సి వుంది. అక్కడికి ఇంక నాలుగు రోజులు మాత్రమే సమయం వుంది. సెన్సారు సర్టిఫికెట్, థియేటర్ల కన్ ఫర్మేషన్ వస్తే తప్ప బుకింగ్ లు తెరుచుకోవు. తమిళనాట డబ్బింగ్ సెన్సారు పూర్తయిపోయింది.
ఈ టెన్షన్లు పడుతూనే మరోపక్క నాన్ తెలుగు ప్రాంతాల్లో పబ్లిసిటీ వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తోంది. ఇంకోపక్క ఫైనల్ సౌండ్ చెకింగ్ ఇంకావుంది. అది పూర్తిచేస్తే కానీ క్యూబ్ లోడింగ్ సాధ్యంకాదు. మొత్తంమీద సైరా ఎంత ప్లాన్ గా వెళ్లినా లాస్ట్ మినిట్ టెన్షన్లు తప్పడంలేదు.