సినిమాల విషయంలో గ్యాప్ ఇవ్వడం బాలయ్యకు అస్సలు ఇష్టం ఉండదు. ఓ సినిమా కంప్లీట్ అయిపోగానే.. మరో సినిమా సెట్స్ పైకి రావాల్సిందే. వందో సినిమా నుంచి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. అయితే జై సింహా విడుదల తర్వాత కావాలనే కాస్త గ్యాప్ తీసుకున్నాడు. భుజానికి సర్జరీ చేయించుకున్నాడు.
భుజం గాయం నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న బాలయ్య.. మరో 4నెలల్లో తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈనెల 29న జరగనున్నాయి. అయితే ఈ 4నెలల గ్యాప్ లో మరో మూవీ పూర్తిచేయాలనే ప్లాన్ లో ఉన్నాడు బాలయ్య. ఈ మేరకు ఇప్పటికే చర్చలు షురూ చేశాడు.
ప్రస్తుతం బాలయ్య లిస్ట్ లో సంపత్ నంది, వినాయక్ ఉన్నారు. వీళ్లలో సంపత్ నంది ఇప్పటికే కథ చెప్పాడు. బాలయ్య పెండింగ్ లో పెట్టాడు. ఇక మిగిలింది వినాయక్ మాత్రమే. వీళ్లిద్దరి కాంబినేషన్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు నిర్మాత సి.కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. గతంలో బాలయ్య-వినాయక్ కాంబోలో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. అది ఫ్లాప్ అయింది.
ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చే కథ చెబితే బాలయ్య మళ్లీ అవకాశం ఇవ్వడానికి వెనకాడడు. కానీ వినాయక్ దగ్గరే కథలు లేవు. ఆ విషయాన్ని ఈమధ్య ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు వినాయక్. పైగా ఇంటిలిజెంట్ డిజాస్టర్ తో మరింత నిరాశలోకి వెళ్లిపోయాడు ఈ దర్శకుడు. కానీ సి.కల్యాణ్ మాత్రం ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడట.