సప్తగిరి తొందరపడుతున్నాడు

సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ సర్రున హీరోగా దూసుకువద్దామని కిందా మీదా అవుతున్నడు కమెడియన్ సప్తగిరి. అంతా బాగానే జరిగింది. చకచకా సినిమా పూర్తయింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అడియో ఫంక్షన్ కు…

సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ సర్రున హీరోగా దూసుకువద్దామని కిందా మీదా అవుతున్నడు కమెడియన్ సప్తగిరి. అంతా బాగానే జరిగింది. చకచకా సినిమా పూర్తయింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అడియో ఫంక్షన్ కు రావడంతో మంచి బజ్ వచ్చింది. కానీ ఉరుములేని పిడుగులా నోట్ల రద్దు వచ్చి పడింది. దాంతో సినిమాలు అన్నీ ఆగిపోయాయి.

వర్షం వచ్చి వెలిసాక హైదరాబాద్ ట్రాఫిక్ లా వుంది ఇప్పుడు సినిమాల పరిస్థితి. ఇలాంటి టైమ్ లో డిసెంబర్ 2 లేదా 16న విడుదల చేసేద్దాం అని సప్తగిరి తొందరపడుతున్నాడని వినికిడి.

ఇలాంటి టైమ్ లో తొందర పడితే మొదటికే మోసం వస్తుంది. 2న విడుదల చేస్తే, ఆ వెనకనే ధృవ, సింగం 3 సినిమాలు వున్నాయి. సప్తగిరి సినిమా కలెక్షన్లు ఎలా వున్నాయి అన్నది కూడా చూడకుండా థియేటర్లలోంచి లేపేసే ప్రమాదం వుంది. గతంలో గోపీచంద్ సినిమాను ఇలాగే లేపేసారు. 

పైగా ధృవ సినిమా నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, అల్లు అరవింద్ చేతిలోనే బోలెడు థియేటర్లు వున్నాయి.  పైగా గీతా ఆర్ట్స్ కు దిల్ రాజు, యువి తో సంబంధాలు వున్నాయి. వాళ్ల థియేటర్లు కూడా వీళ్లకే ఇస్తారు. పైగా సింగం 3 తమిళ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజాతో, సూర్యతో గీతాకు అనుబంధం వుంది. అందువల్ల ఆ సినిమాతోనూ సమస్యే.

పైగా అదే రోజు మోహన్ లాల్ భారీ సినిమా మన్యం పులి విడుదల కూడా వుంది. ఇలాంటి నేపథ్యంలో సప్తగిరి తన సినిమాను 2న తీసుకురావడం మంచిదా కాదా? అన్నదే అనుమానంగావుంది. కానీ సప్తగిరి సమస్య వేరు. అలా వెనక్కు వెళ్తే 30న తప్ప మరో డేట్ లేదు. అది కూడా తప్పిపోతే, నెలలు వెనక్కు వెళ్లాల్సి వుంటుంది.ఇప్పటిదాకా వచ్చిన బజ్ చల్లారిపోతుంది.  మరేం చేస్తాడో చూడాలి.