దాదాపు రెండు మూడేళ్ల కిందట ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ త్వరలోనే పెళ్లి అని చెప్పాడు సీనియర్ నటుడు శరత్ బాబు. వెటరన్ నటి రమాప్రభకు మాజీ భర్తగా పరిచయస్తుడు, నటుడిగా అంతకన్నా ఫేమస్ అయిన శరత్ బాబు మూడేళ్ల కిందట ఆ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వయసులో పెళ్లేంటి.. అనే సందేహాలే వ్యక్తం అయ్యాయి.
బహుశా మనిషికి తోడు ఎక్కువ అవసరం అయ్యేది కూడా ఆ వయసులోనే కదా.. దాంతో శరత్ బాబు పెళ్లి ఆలోచనను సమర్థించడానికి చాలా అవకాశం ఉంది. అలా ప్రకటించి వెళ్లిన ఈ సీనియర్ నటుడు మళ్లీ ఆ ఊసుతో మీడియా ముందుకు రాలేదు. తను పెళ్లి చేసుకోబోతున్నానని.. ఆమె మరెవరో కాదు, ఒక జర్నలిస్టు అని అప్పట్లో శరత్ బాబు ప్రకటించాడు. మీడియాలో పనిచేసే మహిళనే పెళ్లి చేసుకోబోతున్నాను అని వివరించాడు.
ఆ తర్వాత మళ్లీ శరత్ బాబు ఊసు మీడియాలో పెద్దగా వినిపించలేదు. అడపాదడపా సినిమాల్లో అయితే కనిపిస్తూ ఉన్నాడు. అయితే గత పక్షం రోజులుగా కోలీవుడ్ లో కొత్త మాట వినిపిస్తోంది. శరత్ బాబు, నమితలు పెళ్లి చేసుకోబోతున్నారు.. ప్రస్తుతానికి అయితే వాళ్లు సహజీవనంలో ఉన్నారు.. అని తమిళ పత్రికలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సింగిల్ గా ఉన్న నమిత, సింగిల్ గానే ఉన్న శరత్ బాబుతో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి.
శరత్ బాబుతో పోలిస్తే నమిత చాలా చిన్నది అని వేరే చెప్పనక్కర్లేదు. శరత్ బాబు ది షష్టిపూర్తి వయసు.. నమితకు 36 అని వికీ చెబుతోంది. దాదాపు పాతికేళ్ల వయసు తేడా ఉంది వీరి మధ్యన. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పెళ్లిళ్లు ఏమీ కొత్త కాదు. ఇలాంటి వయసు వ్యత్యాసంతో జరిగిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో శరత్‌బాబు- నమితల పెళ్లి కూడా ఒకటవుతుందేమో చూడాలి! ఇప్పటికే కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతున్న శరత్ బాబు కానీ, నమిత కానీ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.