సెక్సీ.. సెక్సీ కామెంట్స్‌.. సినిమా వాళ్ల పరువు బజారులో!

ఒకరా.. ఇద్దరా.. సెక్సీ కామెంట్ల విషయంలో.. సినిమా వాళ్లు వ్యవహరిస్తున్న తీరు.. సినిమా ఇండస్ట్రీ పరువును బజారున పడవేస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీకి ఈ విషయంలో కాస్త ఎక్కువ చెడ్డపేరు ఉందని అనుకుంటే.. ఇప్పుడు నటీమణులు…

ఒకరా.. ఇద్దరా.. సెక్సీ కామెంట్ల విషయంలో.. సినిమా వాళ్లు వ్యవహరిస్తున్న తీరు.. సినిమా ఇండస్ట్రీ పరువును బజారున పడవేస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీకి ఈ విషయంలో కాస్త ఎక్కువ చెడ్డపేరు ఉందని అనుకుంటే.. ఇప్పుడు నటీమణులు చేస్తున్న హాట్‌ కామెంట్స్‌, సినిమా వాళ్లు స్పందిస్తున్న తీరు.. ఓవరాల్‌గా ఇండస్ట్రీపై ఉన్న అంతో ఇంతో గౌరవం కూడా పోయేలా ఉంది.

హాట్‌ కామెంట్స్‌ చేస్తున్న హీరోయిన్లు వాస్తవాలే మాట్లాడుతున్నారు అనడంలేదు.. వీళ్లు వార్తల్లో నిలవడానికి, సంచలనంగా మారడానికే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉండవచ్చు. అయితే.. నిప్పులేనిదే పొగరాదు అనే సామెత ఎలాగూ ఉండనే ఉంది, ఆల్రెడీ ఇండస్ట్రీపై ఇలాంటి బ్యాడ్‌ రిమార్క్స్‌ ఉండనే ఉన్నాయి. సో.. ఇప్పుడు నటీమణులు మాట్లాడుతున్న మాటలు కూడా సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఎవ్వరు మాట్లాడినా.. ఇవి సంచలనాలే అవుతున్నాయి. అంతవరకూ అంతో ఇంతో గుర్తింపులేని వాళ్లు కూడా ఈ తరహాలో మాట్లాడినా.. ఇండస్ట్రీ గురించి ఏదో కొత్త గుట్టు బయటపడిందనే కామన్‌ ఆడియన్స్‌ భావిస్తూ ఉన్నారు.

బాలీవుడ్‌ వైపు వెళ్లిన భామామణుల రచ్చ..

ఒకప్పుడు తెలుగు, దక్షిణాది ఇండస్ట్రీల్లో పనిచేసిన అనుభవం ఉన్న నటీమణులు.. మాట్లాడుతున్న మాటలు సంచలనంగా మారుతున్నాయి. ఇలియానా, రాధికా ఆప్తేలు.. ఈ విషయంలో ముందున్నారు. వీళ్లిద్దరూ తమకు ఎదురైన అనుభవాలు అంటూ.. సంచలన విషయాలు చెబుతున్నారు. తనను ఒక దక్షిణాది హీరో గోకాడు అని, షూటింగుకు వెళ్లిన మొదటిరోజే అతడి రబ్బింగుకు తట్టుకోలేక తను అతడి చెంప పగలగొట్టానని ఈ మధ్యన కొత్త విషయాన్ని సెలవిచ్చింది రాధిక.

అంతకు ముందు కూడా ఈమె ఈ తరహా కామెంట్లు చేసింది. ఇప్పుడు చేసిన కామెంట్లు పాత వాటికి అదనం. తనను ఒక దక్షిణాది హీరో బెడ్రూమ్‌కు రప్పించుకో ప్రయత్నించాడని రాధిక అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే అతడి ఊరు, పేరు చెప్పలేదీమె. అలా చెప్పడంలో ఆమె పరిమితులు ఆమెకు ఉండవచ్చు. 

ఇక ఇలియానా సంగతైతే సరేసరి. దక్షిణాది హీరోల సెక్సీ క్రియేటివిటీ మీదే ఈమె మండిపడుతోంది. వాళ్లు నడుమును, బొడ్డును చూపించే తీరుపై ఈమె ఆ మధ్య విరుచుకుపడింది. తన నడుము మీదకు శంఖాన్ని వదలడంతో తను నొప్పితో అల్లాడిపోయాను అని ఇలియానా చెప్పింది. అందంగా కనిపించే మాట అటుంచితే.. అలాంటి నొప్పికి తట్టుకోవడం మాత్రం ఇబ్బందే అని ఇలియానా వివరించుకొచ్చింది.

ఈ విషయంలో ఈమెను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలియానా అంతటితో ఆగలేదు… ఈ మధ్యనే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనే అంశంపై స్పందించింది. ఒక జూనియర్‌ ఆర్టిస్టును తన సినిమా నిర్మాత ఒకరు వెంటాడి వేధించాడని.. ఆమెను వాడుకోవాలని చూశాడని.. ఆమె వచ్చి తనతో గోడు వెల్లబోసుకుందని ఇలియానా వివరించుకువచ్చింది. తను ఆమెకు ఇచ్చిన సలహా గురించి కూడా ఇలియానా చెప్పుకొచ్చింది. ధైర్యం ఉంటే.. ఆ విషయాన్ని బయటపెట్టి గొడవచేయాలని లేకపోతే కామ్‌గా ఉండాలని తను చెప్పుకొచ్చినట్టుగా ఇలియానా ఇప్పుడు చెప్పింది.

వాళ్లు మాత్రమే కాదు.. సీనియర్‌ నటీమణులు కూడా!

ఈ తరంలోని వారైన ఈ నటీమణులు మాత్రమేకాదు.. కొందరు 90ల హీరోయిన్లు కూడా ఈ విషయంలో సంచలన ప్రకటనలు చేశారు. తాము కూడా లైంగిక వేధింపుల బాధితులమే అని వారు ఓపెన్‌గా చెప్పారు. నటి అర్చన, కస్తూరిలు ఈ తరహా కామెంట్లు చేశారు. 'నిరీక్షణ' వంటి సినిమాలో నటించిన అర్చన.. ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. ఇక్కడ హీరోయిన్లుకు వేధింపులు ఎక్కువ.. తెలుగులో నటించాలని కూడా లేదు.. అని అర్చన చెప్పుకొచ్చింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో నటించడం విషయంలో కూడా ఆమె ఈ తరహా కామెంట్లు చేయడం విశేషం.

ఇక కస్తూరి కూడా ఇదే తరహాలో మాట్లాడింది. తనను ఒక హీరో వేధించాడని.. ఇప్పుడు అతడు రాజకీయాల్లో ఉన్నాడని ఈమె చెప్పుకొచ్చింది. అతడి సరసన తను ఒకే సినిమాలో నటించానని క్లూ కూడా ఇచ్చింది కస్తూరి. ఇలియానా, రాధికా ఆప్తే వంటి వాళ్లు తాము చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని చెబితే.. వాళ్లు ప్రచార ఆర్బాటం కోసం అలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. అయితే.. అర్చన లాంటి వాళ్లకు ఇప్పుడు హాట్‌ కామెంట్లు చేసి వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తున్నారు అనడానికి వీల్లేదు. వాళ్లు ఆ గుర్తింపును కోరుకోవడంలేదు కూడా. 

మరికొందరిది మాత్రం పక్కా ప్రచార ఆర్భాటం..

మాధవీ లత, శ్రీరెడ్డి లాంటి వాళ్లది ప్రచార ఆర్బాటంగా తేల్చేయవచ్చు. వీళ్ల మాటలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాము మాట్లాడితే వెబ్‌సైట్లు కవర్‌ చేస్తాయ్‌.. అన్నట్టుగా ఉంది వీళ్ల కథ. నిజంగానే వీళ్లు చేదు అనుభవాలను ఎదుర్కొని ఉంటే ఎదుర్కొని ఉండవచ్చు కానీ.. వీళ్లు ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా.. అప్పుడప్పుడు ఈ విషయాల గురించి చెబుతూ.. మీడియాకు మసాలా అందిస్తున్నారు, వెబ్‌ వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒకసారి అయితే.. జనాలకు కూడా ఇంట్రస్ట్‌ ఉంటుంది. లేక.. ఇండస్ట్రీలో పరిస్థితి గురించి తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి పూర్తి వాస్తవాలను.. చెబితే అదో లెక్క. అలాకాకుండా మిగతా ఏంచేసినా.. అదంతా పబ్లిసిటీ ఆర్బాటమే అనుకోవాలి.

మేం లొంగలేదు.. కానీ..

ఈ తరహా వ్యాఖ్యలు చేసే నటీమణులు అంతా చెప్పేది ఒకటే మాట. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయి.. కానీ వాటికి మేం లొంగలేదు! మమ్మల్ని హీరోలు వాడుకోవాలని చూశారు.. బెడ్రూమ్‌కు రమ్మన్నారు.. కానీ మేం వెల్లలేదు. నన్ను ఫలానా హీరో గోకాడు.. కానీ అతడికి నేను పడలేదు, చెంప పగలగొట్టాను.. అన్నట్టుగా ఉంది వీళ్ల కథ. తాము లొంగలేదు.. అనే విషయాన్ని చెప్పుకోవడానికి వీళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కానీ తాము చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని మాత్రం చెబుతున్నారు. తాము లొంగామని మాత్రం వీళ్లు చెప్పడంలేదు. మరీ ఎక్కువ సంచలనం కావాలంటే.. తమకు తెలిసిన మరో హీరోయినో, తమకు తెలిసిన మరో జూనియర్‌ ఆర్టిస్టో అలాంటి వాటికి లొంగాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయినా ఎవరో లొంగితే వీళ్లకు వచ్చే నొప్పేంటి? అది వాళ్ల పర్సనల్‌.

ఈ హీరోయిన్లు ఇండస్ట్రీ గురించి ఎంత చెడుగా చెప్పినా.. తాము మాత్రం వాటికి లొంగలేదు అని మాత్రమే చెబుతున్నారు. తద్వారా తమ క్యారెక్టర్‌ గొప్పది అని చెప్పుకో ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి అనేక సినిమాల్లో నటించిన వీళ్లు.. ఎవరికీ లొంగలేదు కదా.. అలాంటప్పుడు ఇండస్ట్రీపై రాళ్లు వేయడానికి ఉన్న హక్కేంటి? ఎవరికీ లొంగకుండా వీళ్లు పదేళ్లకు పైనా హీరోయిన్లుగా రాణించగలుగుతున్నప్పుడు.. ఇక ఇండస్ట్రీలో అమ్మాయిల గురించి బాధేముంది?

తాము లొంగలేదు అని ధైర్యంగా చెబుతున్న హీరోయిన్లు.. ఇండస్ట్రీలో పరిస్థితులు బాగోలేవని.. వేధింపులు ఉన్నాయని ఎందుకు చెబుతున్నట్టు? నిజంగానే వేధింపులు ఉంటే.. వీళ్లు వాటికి మినహాయింపా? వీళ్లు మాత్రమే ప్రతిభను నమ్ముకుని పైకి వచ్చారు.. మిగతావాళ్లు అంతా పడుకుని పైకి వస్తున్నారా? అదా వీళ్లు చెప్పేది? నిజంగానే ఆడవాళ్లపై జాలి ఉంటే, ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటే.. అన్ని వాస్తవాలనూ ప్రస్తావించే శక్తి ఉండాలి.

ఏదో గాసిప్పులు వదిలినట్టుగా మాట్లాడటం ఎందుకు? ఫలానా హీరో గోకినప్పుడు నాకు కళ్లలో నీళ్లు వచ్చాయ్‌.. అని చెప్పుకునే హీరోయిన్లు.. అలా తనను ఇబ్బంది పెట్టిన వాడి పేరును చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నట్టు? అంత చెడ్డవాడి పేరు కూడా చెప్పలేని వీళ్లు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని కంఫర్ట్‌గా ఫీలయినట్టేనా? ఇలాంటి ప్రశ్నలు జనించకమానవు.

ఇవన్నీ కాదు కానీ.. కొన్నాళ్ల కిందట ఇలాంటి అంశం మీదే ఒక వెటరన్‌ నటి స్పందించింది. ఇండస్ట్రీలో 40యేళ్ల నుంచి టచ్‌లో ఉన్న ఆమె స్పందిస్తూ.. లొంగక తప్పదు, లొంగడం మరీ ఎక్కువ అయితే.. బతకు రెడ్‌లైట్‌ ఏరియాలో తెల్లారుతుంది.. అని కుండబద్ధలు కొట్టినట్టుగా వ్యాఖ్యానించింది. అదీ విషయం!