షాకింగ్‌: ‘కోదండ’ క్షమాపణ

'చిరంజీవి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీయడమా? హాస్యాస్పదం.! చిరంజీవి ఇప్పుడు కమర్షియల్‌ సినిమా చేస్తేనే బెటర్‌. మెసేజ్‌ ఇచ్చే సినిమాలు చేస్తే జనం నవ్వుతారు..' అంటూ చిరంజీవితో ఒకప్పుడు అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలు…

'చిరంజీవి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీయడమా? హాస్యాస్పదం.! చిరంజీవి ఇప్పుడు కమర్షియల్‌ సినిమా చేస్తేనే బెటర్‌. మెసేజ్‌ ఇచ్చే సినిమాలు చేస్తే జనం నవ్వుతారు..' అంటూ చిరంజీవితో ఒకప్పుడు అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించి, చిరంజీవి మెగాస్టార్‌ అవడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. 

ఏమయ్యిందో తెలియదుగానీ, ''ఏదో తెలియక ఆ వ్యాఖ్యలు చేసేశాను. నన్ను క్షమించండి. చిరంజీవి, వినాయక్‌, రామ్‌చరణ్‌ నన్ను క్షమించాలి. క్షమాపణ వేడుకుంటున్నాను. నేనెవర్ని సినిమా సక్సెస్‌, ఫ్లాప్‌ గురించి మాట్లాడటానికి. చిరంజీవితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి నాకు మంచి స్నేహితుడు. దురదృష్టవశాత్తూ మీడియా ముఖంగా నేను చిరంజీవిపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేశాను. ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు నాకేమైందో నాకే తెలియదు..'' అంటూ కోదండరామిరెడ్డి సుదీర్ఘమైన వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. 

ఇది నిజంగానే షాకింగ్‌ ఎపిసోడ్‌. కోదండరామిరెడ్డి ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళలేదు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడాయన. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌ హీరోగా 'గొడవ' సినిమా ప్రారంభమయినప్పుడు, చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను చిరంజీవికి వీరాభిమానినని అప్పట్లో వైభవ్‌ చెప్పాడు, ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ చిరంజీవిపై తన అభిమానాన్ని వైభవ్‌ చాటుకున్నాడు. తన కొడుకు, చిరంజీవి అభిమాని అవడం, తాను చిరంజీవికి సన్నిహితుడినవడం తమ అదృష్టమని అప్పట్లో చెప్పుకున్నారు కోదండరామిరెడ్డి. అంతలా కోదండరామిరెడ్డికీ చిరంజీవికీ 'బాండింగ్‌' వుండేది. 

ఏదిఏమైనా, ఈ వివాదానికి కోదండరామిరెడ్డి ఫుల్‌స్టార్‌ పెట్టడం బాగానే వుందిగానీ, కోదండరామిరెడ్డి రేపిన దుమారం.. ఆయన వివరణతో ఆగిపోతుందా.? చిరంజీవి – కోదండరామిరెడ్డి మధ్య స్నేహం ఇదివరకటిలా కొనసాగుతుందా.? వేచి చూడాల్సిందే.