హాలీవుడ్ లో ప్రారంభమైంది.. పెద్దమనుషుల జాతకాల్ని బయటపెట్టింది
బాలీవుడ్ కు విస్తరించింది.. ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది
కోలీవుడ్, శాండిల్ వుడ్ లో కూడా సంచలనాలు మొదలయ్యాయి
మరి టాలీవుడ్ పరిస్థితేంటి? ఇక్కడంతా శ్రీరామచంద్రులేనా.. ఈజ్ ఆల్ వెల్?
మీ-టు మూమెంట్ కు సంబంధించి టాలీవుడ్ స్తబ్దుగా మారింది. పైకి ఏదో పెద్దగా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంలో హీరోయిన్లంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకొచ్చిన గొడవంటూ తమకుతానే సర్దిచెప్పుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం రెమ్యూనరేషన్.
సౌత్ లో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం దక్కే చోటు టాలీవుడ్ మాత్రమే. కోలీవుడ్, శాండిల్ వుడ్ లో ఇంతేసి డబ్బు ఇవ్వరు. స్టార్ డమ్ వస్తే కోలీవుడ్ లో డిమాండ్ చేయొచ్చు కానీ 2-3 హిట్స్ కే అక్కడ రేట్లు పెంచరు. కానీ టాలీవుడ్ లో మాత్రం వ్యవహారం వేరు. ఒక్క హిట్ చాలు. ఎంతైనా పెంచుకోవచ్చు. కొంతైనా పిండుకోవచ్చు. హీరోయిన్లంతా మీ-టూ అనకపోవడానికి ఇదే మెయిన్ రీజన్.
టాలీవుడ్ తో 14 ఏళ్ల అనుబంధం ఉన్న ఓ హీరోయిన్ మొన్న ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. తనను ఇంతవరకు ఎవరూ టచ్ చేయలేదట. టాలీవుడ్ అంత పవిత్రమైందన్నట్టు బిల్డప్ ఇచ్చింది. సెక్సువల్ ఫేవర్స్ చేయకుండానే ఆమె 14 ఏళ్లు కొనసాగిందా? ఆమె కంటే కాస్త లేటుగా వచ్చి, పదేళ్లకు పైగా పరిశ్రమలో కొనసాగుతున్న మరో హీరోయిన్ ది కూడా ఇదేమాట.
మీ-టూ మూమెంట్ కు తన మద్దతు తెలుపుతూనే, తనకు ఎలాంటి చేదు అనుభవాలు లేవంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మరో స్టార్ హీరోయిన్, మీ-టూ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇస్తోంది. తన ఫ్రెండ్స్ కు మద్దతు తెలుపుతోంది.
మరి ఆమె ఎందుకు తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టదు. ఓ చిన్న సినిమా తర్వాత ఏకంగా స్టార్ హీరో సరసన ఎలా ఛాన్స్ వచ్చిందో ఎందుకు చెప్పదు. అదే స్టార్ హీరో ఫ్యాన్స్ గతంలో ఆమెను ట్రోల్ చేసిన విషయాన్ని ఇప్పుడెందుకు బయటపెట్టదు?
మొన్నటికిమొన్న ఘాటు ముద్దులతో హీటెక్కించిన హీరోయిన్ సైతం కాస్టింగ్ కౌచ్ అస్సలు లేదనడం విడ్డూరం. అలాంటివి తనకు ఎదురైతే అక్కడే నిలదీస్తా, మీడియా ముందు బయటపెడతానంటూ కబుర్లు చెప్పడం ఆశ్యర్యకరం. ఎందుకంటే ఆమెపై జరిగిన వేధింపులు చెబితే ఒక రోజు చాలదు మరి.
ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లంతా మూకుమ్మడిగా ఓ మాట అనుకొని మరీ సైలెంట్ అయిపోయారు. అంతా కలిసి తమకు తెలియకుండానే టాలీవుడ్ హీరోల్ని శ్రీరామచంద్రుల్ని చేసేస్తున్నారు. నిజంగా మన హీరోలు అంత బుద్ధిమంతులా..? టాలెంట్ చూసే అమ్మాయిలకు ఛాన్స్ ఇస్తున్నారా..? తెరవెనక ఏం జరగకుండానే కెమెరా ముందు నిలబెడుతున్నారా..?
ఏ అమ్మాయైనా తనతో ముందుగా పడుకుంటేనే తప్ప ఛాన్స్ ఇవ్వని హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. కేవలం హీరోయిన్ తో ప్రైవేట్ రొమాన్స్ కోసమే అవసరం లేకపోయినా ఫారిన్ షెడ్యూల్ పెట్టే హీరోలున్నారు. అగ్రిమెంట్ టైమ్ లోనే హీరోలకు కాస్త 'సహకారం' అందించాలంటూ మాట తీసుకొని అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలున్నారు.
కొంచెం కోపరేట్ చేస్తే నెక్స్ సినిమా ఛాన్స్ కూడా ఇస్తామంటూ 'పనికానిచ్చేసే' కుర్ర హీరోలు కోకొల్లలు. అంతెందుకు… నటన రాకపోయినా, ఒక్క ఎక్స్ ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేకపోయినా ఉత్తరాది అమ్మాయిలకు టాలీవుడ్ లో వెంటనే అవకాశాలు ఎలా వస్తున్నాయి?
ఇవన్నీ బహిరంగ రహస్యాలు. ఇండస్ట్రీలో లైట్ బాయ్ ను అడిగినా చెబుతాడు. కానీ మాట్లాడాల్సిన వ్యక్తులు మాత్రం మాట్లాడరు. ఈ విషయంలో బోల్డ్ గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ కు వచ్చేసరికి సైలెంట్ అయిపోవడం ఆశ్చర్యం. తలుచుకుంటే రాధికా ఆప్టేలా తాము కూడా హీరోల బాగోతాన్ని బయటపెట్టొచ్చు. కానీ చాలామంది హీరోయిన్లు ఆ పని చేయడంలేదు.
ఈ ఒక్క విషయంలో మాత్రం “టాలీవుడ్ శ్రీరామచంద్రులు” అంతా ఒక్కటైనట్టున్నారు. మీ-టూను తొక్కిపెట్టేందుకు “వియ్-ఆల్” ఉద్యమాన్ని తెరవెనక సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నట్టున్నారు.