మురుగదాస్ లాంటి వైవిధ్యమైన, నేషనల్ వైడ్ పేరున్న దర్శకుడు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తుంటే, దాని పబ్లిసిటీ ఎలా వుండాలి? పీక్స్ లో వుండాలి. కానీ లో ప్రొఫైల్ లో సాగుతోంది. ఎందుకు? 130కోట్లకు పై మార్కెట్ చేసిన ఆ సినిమా గురించి అలా అలా జస్ట్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. మహేష్ బాబు పెద్దగా ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎప్పుడూ మహేష్ సినిమాల ప్రచారం విషయంలో కలుగుచేసుకునే నమత్ర ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా వున్నారు.
ఈ మొత్తం వ్యవహారం అంతటి వెనుక మహేష్ బాబు వున్నట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బొగట్టా. బ్రహ్మోత్సవం సినిమా పరాజయం నేపథ్యంలో ఈసారి స్పైడర్ సినిమా విషయంలో కాస్త లో ప్రొఫైల్ నే మెయింటెయిన్ చేయాలని మహేష్ బాబు స్పైడర్ యూనిట్ కు సూచించినట్లు తెలుస్తోంది. చెన్నయ్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం స్పైడర్ సినిమా ప్రొడక్ట్ బాగా వచ్చిందని తెలుస్తోంది. ఒక్క క్లయిమాక్స్ మినహా మిగిలిన ప్రొడక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిపోయిందని వినికిడి. అప్పటి దాకా సినిమా చూసిన చెన్నయ్ టెక్నీషియన్లు మాత్రం మాంచి రిపోర్టు ఇస్తున్నారు.
ముఖ్యంగా స్పైడర్ కు సంబంధించిన కీ టెక్నీషియన్లు మురుగదాస్, సంతోష్ శివన్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. మహేష్ మాటల్లో కూడా ఆ కాన్పిడెన్స్ తొంగి చూస్తోంది. రీరికార్డింగ్ చేసిన హారిష్ జయరాజ్, సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్ గా సన్నిహితులకు ఫీడ్ బ్యాక్ ఇచినట్లు బొగట్టా. ఇన్ని పాజిటివ్ టాక్ లు వినవస్తున్నా, సినిమా విడుదల వరకు వీలయినంత లో ప్రొఫైల్ పబ్లిసిటీనే మెయింటెయిన్ చేయాలని మహేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వన్స్, సినిమా విడుదలయిన తరువాత సినిమానే మాట్లాడుతుందని, ఎంత పబ్లిసిటీ హడావుడి చేసినా, సినిమా తొలి రోజు, తొలి ఆట పడేవరకే అని స్పైడర్ యూనిట్ భావిస్తోంది. ఆ తరువాత సినిమాను జనంలోకి తీసుకెళ్లేది మౌత్ టాక్ మాత్రమే అని. అందువల్ల ఓ పెద్ద సినిమాకు నార్మల్ గా ఎలా చేస్తారో, అలాగే ప్రచారం చేయాలని, ఎక్స్ టార్డినరీ ప్రచారం అవసరం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ చరిష్మాతో ఓపెనింగ్స్ ఎలాగూ వస్తాయి. ఆపైన సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సింది సినిమానే. ఎంత హడావుడి చేసినా సినిమా బాగులేకుంటే ఎంత భారీ సినిమానైనా తీసి పక్కన పెడతారు.
సో ఈ సూత్రం వంటపట్టింది కనుకే, మహేష్ తన సినిమా గురించి తను ఎక్కువ ఊదరగొట్టాలని అనుకోవడం లేదట. అంటే ఛానెల్ ఇంటర్వూలు కూడా వుండకపోవచ్చు. జస్ట్ గ్రూప్ లతో ముచ్చటించి ఊరుకుంటారని తెలుస్తోంది.