టాలీవుడ్ ను నటి శ్రీరెడ్డి పట్టి కుదుపుతోంది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మామూలుగా చేయడం కాకుండా, చానెళ్లలో ఆమె మాట్లాడుతున్న తీరు, ఫేస్ బుక్ లో ఆమె పెడుతున్న పోస్టింగ్ లు ఇవన్నీ భయంకరమైన సంచలనాలు రేపాయి. అయితే ఇది మాత్రమే సమస్య కాదు. కేవలం ఆమె చానెళ్లలోనో, ఫేస్ బుక్ లోనో చేస్తున్నవాటిని ఆధారంగా చేసుకుని. యూట్యూబ్ చానెళ్లలో లెక్కకు మిక్కిలిగా పుట్టుకు వస్తున్న వీడియోలు. ఇవన్నీ కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీ జనాలకు అతలాకుతలం చేస్తున్నాయి.
అందుకే ఇప్పుడు టాలీవుడ్ కదులుతోంది. మొన్నటికి మొన్న ఓ చానెల్ న్యూస్ ప్రెజెంటర్ చేసిన కామెంట్ లపై ఇండస్ట్రీలోని కొంతమంది కదిలి పోలీసు ఫిర్యాదు చేసారు. ప్రెస్ మీట్ పెట్టారు. కానీ దాని వల్ల ఏమీ సాధించలేదు. పోలీసులు పెద్దగా స్పందిచలేదని తెలుస్తోంది. దీంతో ఎవరైతే హడావుడి చేసారో, వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. మీడియాకు వ్యతిరేకంగా అంత సులువుగా చర్యలు తీసుకోలేమని పోలీసులు టాలీవుడ్ జనాలకు చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే శ్రీరెడ్డి ఇస్యూ మీద ఇక రెండు అంచెల దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి పోలీసులకు ఎప్పటిలాగే ఫిర్యాదు చేయడం. మరో పక్క లీగల్ గా ప్రొసీడ్ కావడం. ఇప్పటికే శేఖర్ కమ్ముల ఆ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు లీగల్ గా ప్రోసీడ్ కావడానికి ముందుకు వెళ్తున్నారు.
అదే సమయంలో నిన్నటికి నిన్న ఛాంబర్ తరపున పోలీసులకు ఫిర్యాదు అందినట్లు వాట్సప్ లో కొన్ని డాక్యూమెంట్లు చలామణీ అయ్యాయి. అయితే ఇవి నిజమా? కాదా? అన్న ధృవీకరణ లేదు. పైగా ఆ కాగితాల్లో ఛాంబర్ తరపున కొన్నేటి పవన్ కళ్యాణ్ అనే ఆయన ఫిర్యాదు చేసినట్లు వుంది. పైగా టాలీవుడ్ ఫిలించాంబర్ ఆఫ్ కామర్ అని వుంది. ఈ కె కళ్యాణ్ ఎవరో? ఆ చాంబర్ ఏమిటో తెలియదు.
కానీ శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన మిగిలిన వారు కూడా లీగల్ గానే ప్రొసీడ్ కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసి, వాళ్లు యాక్షన్ తీసుకోవడం, తీసుకోకపోవడం కన్నా, తమపై ఆరోఫణలకు ఆధారాలు చూపాలని లీగల్ గా ప్రొసీడ్ కావడం బెటర్ అన్నట్లుగా ఓ సినిమా సెలబ్రిటీ అభిప్రాయం వ్యక్తం చేసారు.
శ్రీరెడ్డి తెలివే తెలివి
ఇదిలా వుంటే శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో కప్పదాటు వేసినట్లు కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల విషయంలో తానేమీ అనలేదన్నట్లు, తాను తన ఫేస్ బుక్ పేజీలో ఫ్యాన్స్ కోసం కల్పిత కథలుచెబుతా అని, మీరేమీ అనుకోవద్దని పోస్ట్ పెట్టడం విశేషం. అలాగే మరో ఫేమస్ డైరక్టర్ ను ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టడం విశేషం.
శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా, లీగల్ గా దొరకకుండా వుండే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. జాహువల్లి (బాహుబలి అనే అర్థం వచ్చేలా) తాజా బొక్కెన్ (తాజ్ డెక్కన్ అనే అర్థం వచ్చేలా) పదాలు మార్చి వాడడం ఇక్కడ గమనించవచ్చు.
శ్రీరెడ్డి సినిమా సెలబ్రిటీలను ఓ ఆట ఆడుకోవడంలో మాత్రం మాంచి తెలివితేటలు, ప్రజ్ఞ కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.
అమ్మాయిలకు నో ఎంట్రీ
ఇప్పడు టాలీవుడ్ డైరక్టర్లు కొంత మంది తమ తమ ఆఫీస్ అటెండర్లకు క్లియర్ ఆదేశాలు ఇచ్చేసారట. చాన్స్ ల కోసం తమ ఆఫీసులకు ఆల్బమ్ లు పట్టుకుని ఏ అమ్మాయిలు వచ్చినా లోపలకు పంపించవద్దని చెప్పేసారట. గతంలో ఎవరైనా వస్తే, మొహమాటానికి, అలాగే ఆల్బమ్, డిటైల్స్ ఇచ్చి వెళ్లండి అని చెప్పేవారు. ఇప్పుడు అసలు గేట్ నుంచే వెనక్కు పంపేస్తున్నారు అని తెలుస్తోంది.
యూట్యూబ్ మీడియా వేరు
ఇదిలా వుంటే యూట్యూబ్ లో పుంఖానుపుంఖాలుగా పెడుతున్న వీడియోలు కూడా మీడియానే అనుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రింట్ మీడియా, విజువల్ మీడియా, కొంత వరకు వెబ్ మీడియాకు వున్నట్లు, తామర తంపరగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ చానెళ్లకు మీడియా అయిడెంటిటీ లేదు. అది అసలు మీడియా కిందకు రాదు. సోషల్ మీడియా అనే గొడుగు కిందకు వస్తే రావచ్చు. కానీ టాలీవుడ్ చేస్తున్న పొరపాటు ఏమిటంటే, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రెండూ ఒకటే టైపు అనుకుంటోంది. ఆ విధంగానే టాలీవుడ్ జనాలు మాట్లాడుతున్నారు.
అసలు టాలీవుడ్ జనాల సమస్య అంతా ఈ యూట్యూబ్ చానెళ్లే. యూట్యూబ్ చానెళ్లు పుట్టుకు రాక ముందు టాలీవుడ్ జనాలు ఇంతలా ఫీల్ కాలేదు. ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లలో హిట్ ల కోసం పెట్టే హెడ్డింగ్ లు టాలీవుడ్ జనాలకు అభ్యంతరకరంగా వుంటున్నాయి.
ఈ విషయంలో టాలీవుడ్ జనాలకు సరైన క్లారిటీ లేదు. అందుకే వారి పోరాటం ఎవరి మీదనో వారికే తెలియదు. క్లారిటీ లేని పోరాటం, పైగా ఎవరికి నొప్పి కలిగితే వారిదే పోరాటం. మిగిలిన వారు సైలెంట్ గా వుంటున్నారు. దీంతో టాలీవుడ్ పోరు ఆరంభ శూరత్వం లాగే మిగులుతోంది.