దాదాపు ఏడాదిగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఆ ఇద్దరూ నలుగుతున్నారు. కథలు అల్లుతూనే ఉన్నారు. అల్లు అరవింద్ కు వినిపిస్తూనే ఉన్నారు. కానీ ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదు. వాళ్లే బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల. చెరొక డిజాస్టర్ ఇచ్చిన తర్వాత గీతాఆర్ట్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు వీళ్లిద్దరు.
మరోసారి సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు టైపులో కథ రాసుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. రీసెంట్ గా అల్లు అరవింద్ కు ఆ స్టోరీ కూడా చెప్పాడట. అరవింద్ చెప్పిన మార్పులుచేర్పులు కూడా పూర్తయ్యాయి. కానీ ప్రాజెక్టుపై మాత్రం అరవింద్ ఏం మాట్లాడలేదు.
నిజానికి ఈ ప్రాజెక్టులో చాన్నాళ్ల కిందటే శర్వానంద్ పేరు వినిపించింది. అల్లు అరవింద దగ్గర శర్వానంద్ డేట్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో అనుకున్న కథ వేరు. ఇప్పుడు అడ్డాల రాసుకున్న కథ వేరు. ఈసారి శర్వానంద్ తో పాటు మరో హీరో కూడా కావాలి. అక్కడే ఆగింది బండి.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ ది మరో వ్యథ. చాన్నాళ్లుగా మెగాఫోన్ కు దూరమైన ఈ దర్శకుడు కూడా ఓ స్టోరీ రాసుకున్నాడు. అది కూడా బొమ్మరిల్లు స్టయిల్ లోనే రాసుకున్నాడట. ఆర్ఎక్స్-100, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు నడుస్తున్న ఈ టైమ్ లో, బొమ్మరిల్లు కాస్పెప్టులు నడుస్తాయా అనేది అరవింద డౌట్. అందుకే ఆ ప్రాజెక్టును కూడా హోల్డ్ లో పెట్టేశాడు.
మొత్తమ్మీద శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరూ గీతాఆర్ట్స్ బ్యానర్ లో లాక్ అయిపోయారు. గతంలో అల్లు అరవింద్ వద్ద తీసుకున్న అడ్వాన్సుల వల్ల వీళ్లు మరో నిర్మాతను సంప్రదించలేకపోతున్నారు.