ఇప్పటికే జగపతిబాబును విలన్ గా పరిచయం చేశాడు బాలయ్య. నటసింహం నటించిన లెజెండ్ సినిమాతోనే విలన్ అయ్యాడు జగపతి. ఇప్పుడు మరో సీనియర్ హీరోను కూడా విలన్ గా మార్చేస్తున్నాడు బాలకృష్ణ. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రాబోతున్న సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించే ఛాన్స్ ఉంది.
అయితే బాలకృష్ణ సినిమాతోనే విలన్ గా మారట్లేదు శ్రీకాంత్. ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న ఓ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. నాగచైతన్య సినిమా కంటే ముందే విడుదలకాబోతున్న ఓ కన్నడ సినిమాలో కూడా విలన్ వేషం వేశాడు శ్రీకాంత్. అంటే.. బాలయ్య మూవీ విలన్ గా శ్రీకాంత్ కు మూడో సినిమా అన్నమాట.
గతంలో బాలకృష్ణ-శ్రీకాంత్ కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే ఆ సినిమాల్లో శ్రీకాంత్ చేసినవి క్యారెక్టర్ రోల్స్ మాత్రమే. ఇప్పుడిప్పుడే నెగెటివ్ షేడ్స్ లో కనిపించడం స్టార్ట్ చేశాడు. జగపతిబాబులా తను కూడా విలన్ గా క్లిక్ అయిపోతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
ఆగస్ట్ రెండో వారం నుంచి బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకున్న విషయం తెలిసిందే.