హీరోయిన్లు చాలా తెలివైన వాళ్లు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు. ఇప్పుడు కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్ కూడా ఈ తరహా తెలివితేటలనే కనబరుస్తోంది. పారితోషకం విషయంలో ఆమె తెలివిగా డీల్ చేస్తోంది. అవకాశం ఉన్న చోట రాబట్టుకొంటే.. రాదనుకొన్న చోట తగ్గి ఉంటోంది. దీంట్టో పెద్ద ప్లానే ఉంది. శ్రుతి ఇప్పుడు తెలుగులో పీక్ స్టేజ్ లో ఉంది. 'శ్రీమంతుడు' హిట్ కావడం, ఆమె పాత్రకు మంచి పేరు, గుర్తింపు రావడంతో శ్రుతి పారితోషకాన్ని పెంచినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ పెంపు కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకే! తన డేట్స్ మొత్తాన్నీ ఆమె ఇదే ధరతో తూకం వేయడం లేదు. ఆ డేట్స్ ను తెలుగు సినిమాకు కేటాయిస్తే ఒకలా.. తమిళానికి కేటాయిస్తే మరోలా.. హిందీకి అయితే ఇంకోలా.. ధర కడుతోంది శ్రుతి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రుతి ఇప్పుడు తెలుగు సినిమా ఒప్పుకోవాలంటే కోటిన్నర పై స్థాయి లో డిమాండ్ చేస్తోంది. అదే తమిళంలో అయితే.. ఇంకాస్త తక్కువకే ఓకే అంటోంది. కోటిన్నర లోపు మొత్తానికే సై అంటోంది. అదే హిందీ సినిమాల విషయంలో అయితే శ్రుతి పారితోషకాన్ని గట్టిగా డిమాండ్ చేయడం లేదు!
కోటి రూపాయల లోపు మొత్తానికి కూడా శ్రుతి సైన్ చేసేస్తోంది. హిందీలో ఆమెకు దక్కుతున్న పారితోషకం లక్షల స్థాయిలోనే ఉంటోంది. కాస్త పెద్ద హీరోల సినిమాల్లో.. కొంచెం ప్రాధాన్యత ఉండే పాత్ర దక్కితే చాలు శ్రుతి ఓకే అంటోంది. శ్రుతి టార్గెట్ బాలీవుడ్ లో వెలగడం.. అందుకే ఆమె అక్కడ తక్కవ పారితోషకానికి సై అంటోంది. ప్రాధాన్యత ఉండే పాత్ర దక్కితే చాలంటోంది. ఇక దక్షిణాదిలో ఇప్పటికే పేరు తెచ్చుకొంది కాబట్టి.. ఇప్పడు ఇక్కడ వీలైనంత రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదీ శ్రుతిహాసన్ లెక్క.