కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 96 సినిమా తెలుగులోకి రాబోతోంది. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్థారించాడు. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారనే విషయాన్ని కూడా ప్రకటించాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఇది.
96 మూవీ తెలుగు వెర్షన్ కు మార్పుచేర్పులు జరగబోతున్నాయి. తమిళ్ లో ఉన్నది ఉన్నట్టు తెలుగులో రీమేక్ చేస్తే ఆడడం కష్టం. ఇదే విషయాన్ని హీరో నాని, దిల్ రాజుకు చెప్పి తప్పుకున్నాడు. ఈ సినిమా చేయడానికి అంగీకరించిన సమంత కూడా ఇదే కండిషన్ పెట్టింది. పైగా దిల్ రాజుకు కూడా ఉన్నది ఉన్నట్టు తీయడం ఇష్టంలేదు.
నిజానికి ఈ సినిమా చేయడానికి ముందుగా సమంత ఒప్పుకోలేదు. ఇలాంటి హై-ఎమోషనల్ మూవీని రీమేక్ చేయకూడదంటూ గతంలో తన నిరసన కూడా తెలియజేసింది. కట్ చేస్తే, ఇప్పుడు త్రిష పోషించిన పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కారణం సమంత చెప్పిన మార్పులు చేయడానికి దిల్ రాజు అంగీకరించడమే.
సమంత, దిల్ రాజు సూచనల మేరకు 96 కథకు రిపేర్లు మొదలయ్యాయి. రచయితలకు దిల్ రాజు నెలరోజులు డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. అప్పట్లోగా మార్పుచేర్పులు కుదిరితే సినిమాను ప్రకటిస్తారు. లేదంటే మరో నెలరోజులు వాయిదా వేస్తారు. తాజా మార్పుచేర్పులు తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తాయనేది చూడాలి.