మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నపుడు ఇద్దరు హీరోల్లో ఒక హీరోకి ఎప్పుడూ సమస్యే. కాస్త లీడ్ లో వున్న హీరోకు ఆటోమెటిక్ గా ప్రమోషన్ సులువుగా దొరుకుతుంది. రెండో హీరోకే సమస్య వస్తుంది. వి సినిమా విషయంలో విడుదల దగ్గర అయిన నాటి నుంచీ ఇదే సమస్య. ప్రచారం అంతా నాని చుట్టూ, ఇది నాని సినిమా అన్నట్లుగా తిరిగింది. అప్పటికీ సుధీర్ బాబు తన స్వంత ప్రచారం విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కిందా మీదా ప్రయత్నిస్తున్నారు.
చిత్రమేమిటంటే సినిమా విడుదలయిన తరువాత కూడా ఎక్కువగా పాజిటివ్ విషయాల్లో నాని యాక్టింగ్ గురించే ప్రస్తావనలు వస్తున్నాయి తప్ప సుధీర్ గురించి కాదు. నిజానికి సినిమాలో నాని కన్నా సుధీర్ దే ఎక్కువ రోల్. కానీ సుధీర్ క్యారెక్టర్ ను డైరక్టర్ డిజైన్ చేసి, నడిపించిన తీరు వల్ల ఆ పాత్రకు అంతగా ప్రశంసలు దక్కకుండా చేసింది. నాని క్యారెక్టర్ తో బలంగా పోటీ పడేలా సుధీర్ క్యారెక్టర్ ను నడిపించి వుంటే వేరుగా వుండేది. అలా జరగలేదు. దానివల్ల సుధీర్ నటన కూడా పండినట్లు అనిపించలేదు.
దీంతో సమీక్షల్లో, సోషల్ మీడియాలో సినిమా ఎలా వున్నా నాని బాగా చేసాడు నాని బాగా చేసాడు అంటున్న లైన్లు కనిపిస్తున్నాయి తప్ప సుధీర్ బాబు గురించి ప్రస్తావన తక్కువగా వుంటోంది. దీంతో ఇప్పుడు సుధీర్ కు వి సినిమా ఉపయోగపడేలా,. సుధీర్ నటన గురించి కూడా జనం డిస్కస్ చేసేలా, సోషల్ మీడియాలో సుధీర్ ప్రస్తావన వచ్చేలా చేయడానికి ప్రయత్నాలు సీరియస్ గా జరుగుతున్నట్లు బోగట్టా. కానీ అక్కడ ఏమన్నా విషయం వుంటేగా ఎవరన్నా ఏమన్నా చేయడానికి. అందుకే ఆ పాజిటివ్ ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు.