నా పేరు సూర్య సినిమా విడుదల గంటల్లోకి వచ్చేసింది. భరత్ అనే నేను సినిమా విడుదల తరువాత వారం రోజుల పాటు హీరో మహేష్ బాబు పూర్తిగా ప్రచారానికే కేటాయించారు. ఫుల్ గా ఇంటర్వూలు, మీడియా మీట్ లు, ఇలా అవిశ్రాంతంగా ప్రచారం చేసారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు బన్నీ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాడట.
సినిమా విడుదలయిన మర్నాటి నుంచి టాక్ ను బట్టి, వారం లేదా ఇంకా ఆపైన నా పేరు సూర్య పబ్లిసిటీ కి కేటాయిస్తానని తన పీఆర్ టీమ్ కు చెప్పాడట. ఈ సినిమా మీద ఇప్పుటికి వున్న అంచనాలు చాలని, ఇంకా పెంచి, హడావుడి చేయడం సరి కాదన్నది బన్నీ అభిప్రాయంగా తెలుస్తోంది.
విడుదలకు ముందు ఒక్క మీడియా మీట్ పెడదామని అంటే, ఇప్పుడు తానేం చెప్పినా సినిమా గురించి గొప్పలు చెప్పినట్లు వుంటుందని, అదే విడుదలయిన తరువాత అయితే, సినిమా ఎలావుంది? దాని మంచి చెడ్డలు తెలిసి, మీడియానే అడుగుతుందని, అప్పుడు తాను చెప్పడం సమంజసంగా వుంటుందని బన్నీ అన్నట్లు తెలుస్తోంది.
సినిమాకు రావాల్సిన బజ్ వచ్చిందని, అందువల్ల ఇంటర్వూలు, పబ్లిసిటీ హడావుడి అంతా విడుదల తరువాతే ప్లాన్ చేద్దామని, సినిమా సక్సెస్ అయితే, ఆ తరువాత ఎంతయినా చేసుకునే స్కోప్ వుందని, దాన్ని వాడుకుందామని బన్నీ అన్నాడట. హీరోలు కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు మొత్తానికి.