కొన్ని చానెళ్లకు మాత్రమే ప్రకటనలు ఇవ్వాలంటూ కొంత మంది నిర్మాతలు, కౌన్సిల్ తో సంబంధం లేకుండా, సిండికేట్ గా మారి స్వంత నిర్ణయాలు, స్వంత దుకాణం పెట్టుకున్నారు. దీంతో మీడియా కు మండింది. కానీ మీడియా అన్నాక కొన్ని పద్దతులు, పడికట్టు విధానాలు తప్పవు కదా. అందుకే సైలెంట్ అయ్యారు. కానీ ఆంధ్రజ్యోతి వ్యవహారం వేరు. మొండితనానికి, ఎదురీతకు పెట్టింది పేరు. వరుస కథనాలతో ఇండస్ట్రీని తూర్పార పట్టడం మొదలెట్టింది.
ఇప్పటిదాకా రంగుల హరివిల్లులా కనిపించిన సినిమా పరిశ్రమ ఇప్పుడు అచ్చమైన గొంగళీపురుగులా కనిపించడం ప్రారంభించింది. హీరోలు, నిర్మాతలు, దర్శకులు వీరు వారని లేదు, అందరి మైనస్ లు వెదికి వెదికి ప్రచురించింది.
నిజానికి ఇవేవీ కొత్తవో, ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవో కాదు. వెబ్ మీడియా స్వేచ్ఛగా ఎప్పటి నుంచో రాస్తున్నవే. వాటన్నింటిని ఇప్పుడు క్రోడీకరించి తన పాఠకుల ముందుకు తెచ్చింది. అంతటితో ఆగలేదు. ఎప్పుడూ చేయనిది, సినిమాలపై సమీక్షలు ప్రచురించడం ప్రారంభించింది. అది కూడా అన్ని సినిమాల మీదా కాదు. ఎవరైతే సిండికేట్ లో వున్నారో, వారి సినిమాల మీదనే గురిపెట్టింది.
దోచేయ్ సినిమాను ఉతికి ఆరేసింది..పండగచేస్కోను దండగ చేస్కో అంది. ఈలోగా చాలా సినిమాలు వచ్చాయి. అస్సలు బాగాలేనివి వచ్చాయి. కానీ వాటి జోలికి మాత్రం పోలేదు. చిత్రంగా సాక్షి కూడా అన్నింటికీ సమీక్షలు ఈ వివాదానానికి చాలా కాలం ముందే ప్రచురించడం ప్రారంభించింది. కానీ నిర్మాతలు సాక్షి యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసారు.
ఇలా విడుదలయిన రోజునే సమీక్షలు రావడం వల్ల, మారు మూల పల్లెల్లోకి కూడా అభిప్రాయం చేరిపోతోందని, కాస్త ఆలోచించాలని కోరారు. దాంతో సమీక్షలు ఆపేసింది సాక్షి. ఈ వివాదం తరువాత సమీక్షలు ప్రచురిస్తోంది కానీ, టార్గెట్ చేసిన నిర్మాతల సినిమాల మీదే కాదు. అన్ని సినిమాల మీద. మళ్లీ అలా అని ఈకకు ఈక, తోకకు తోక పీకుతూ కాదు..కాస్త మధ్యస్తంగా.
ఆంధ్రజ్యోతి వ్యవహారం ఇప్పుడు సినిమా నిర్మాతలను ముఖ్యంగా సిండికేట్ జనాలను బెంబేలెత్తించింది. కాసిన్ని వేల కోసం చూసుకుంటే కోట్లకు మోసం వస్తోందని గ్రహించినట్లుంది. సిండికేట్ కు ప్రాణ ప్రతిష్ఠ చేసిన నిర్మాత దిల్ రాజే తన కేరింత సినిమా వరకు వచ్చేసరికి కిందకు దిగిపోయారు. ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు.
సమీక్ష ఆపేసారా
సినిమా రంగంలో ఓ వదంతి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. కేరింత-ఆవులింత అని శీర్షిక పెట్టి సమీక్ష రెడీ చేసారని, అలాంటి సమయంలో దిల్ రాజు నేరుగా కాకుండా తన భాగస్వామల ద్వారా మాట్లాడి, ప్రకటనలు ఇచ్చి దాన్ని ఆపించారన్నది ఆ వదంతి సారంశం. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, సమీక్ష అయితే కేరింత మీద రాలేదు.
ప్రసాద్ ల గగ్గోలు
దిల్ రాజు సిండికేట్ అని చెప్పి అందర్నీ కూడగట్టి ఇప్పడు ఇలా చేయడంపై నిర్మాతలు పరుచూరి ప్రసాద్, భోగవిల్లి ప్రసాద్ బాధ పడుతున్నట్లు వినికిడి. తమ సినిమాల సమయంలో నిబంధనలు అని చెప్పి, దిల్ రాజు సినిమా దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేసరాని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి.
దిల్ రాజు సమర్థన
దిల్ రాజు తన వ్వవహారాన్ని వేరే విధంగా సమర్థించుకుంటున్నట్లు వినికిడి. ఆంధ్రజ్యోతి ప్రింట్ కు ప్రకటనలు ఇవ్వమని తాము అనలేదని, ఎబిఎన్ కు ఇవ్వకుంటే వారు ప్రింట్ కు తీసుకోలేదని, అయినా తమకు ఏ మీడియా మీదా కోపం లేదని, తమ రేటు కు ఓకె అంటే అందరికీ ప్రకటనలు ఇస్తామని ఈ వైనం పై ప్రశ్నించినవారికి బదులిస్తున్నారట.
ఈపద్దతి మంచిదేనా?
ప్రకటనలిస్తే సమీక్షలు ఆపడం, ప్రకటనలు ఇవ్వకుంటే నెగిటివ్ వార్తలు రాయడం, వాటికే సమీక్షలు రాయడం ఎంతవరకు సమంజసమని మరోపక్క టాలీవుడ్ లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీడియా అందరి పట్ల ఒకే మాదిరిగా వ్యవహరించాలని, ఇక ప్రకటనలు ఇవ్వడం ప్రారంభిస్తారు కాబట్టి, సినిమా రంగం చీకటి వ్యవహారాలపై వార్తలు కానీ, చెత్త సినిమాలపై సమీక్షలు కానీ ఇక కనిపించవేమో అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతికి ఇంతో అంతో సర్క్యులేషన్ వుంది కాబట్టి ఈ విధంగా వార్తలు, సమీక్షలు రాసి, ప్రకటనలు రాబట్టవచ్చు. కానీ మిగిలిన చిన్నా చితకా చానెళ్లు, ప్రింట్ మీడియా పరిస్థితి ఏమిటి? వారు ఈ విధంగా రాసినా నడవదు. ఎవరూ బెదరరు.
జనాలు తెలివి మీరారు
మీడియాను మేనేజ్ చేసినంత మాత్రాన, సమీక్షలు ఆపినంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయని అనుకోవడం కూడా భ్రమే. మంచి సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి, లేదా బాగులేని సినిమా పట్ల జనాలను హెచ్చరించడానికి సమీక్షలు పనికివస్తాయి. కానీ మౌత్ టాక్ ను మించింది లేదు.
జనం అభిరుచి మంచిదా, చెడ్డదా అన్నది పక్కనపెడితే వారు ఇష్టం పడితే సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే పండగచేస్కో సినిమా క్రిటిక్స్ కు పెద్ద నచ్చలేదు. అందులో డబుల్ మీనింగ్ డైలాగులు, రొటీన్ కథ, కథనాలు వున్నాయి. దానికి నెగిటివ్ సమీక్షలే వచ్చాయి. కానీ సినిమాను జనం పెద్ద హిట్ చేసేసారు.
మొత్తానికి మీడియా-సిండికేట్ వివాదంలో మీడియానే గెలిచింది. సిండికేట్ సంతకెళ్లింది. ఇప్పటికీ దిల్ రాజు నాయకత్వాన్ని నిర్మాతలు ఆమోదించవచ్చు..ఎందుకుంటే ఆయన నిర్మాత మాత్రమే కాదు. డిస్ట్రిబ్యూటర్..ఎగ్జిబిటర్ కూడా కనుక. కానీ ఆయన ఇమేజ్ డామేజ్ అయ్యిందన్నది మాత్రం వాస్తవం.
'కలం'కార్