ఎన్టీఆర్ బయోపిక్‌ను వదిలేసి తేజ మంచిపనే చేశాడు.. ఇంత నేరుగా చెప్పటం చాలా మందికి ఇబ్బందిగానే ఉండచ్చు కానీ తేజ చేసింది మంచిపనే! ఒక పెద్ద నటుడి సినిమాను మొదలుపెట్టి మధ్యలో వదిలేయటం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ఏ దర్శకుడికైనా ఇబ్బందికరమైన పరిణామమే! అయినా తేజా మంచిపనే చేశాడనిపిస్తుంది.
అసలు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఎవరికి కావాలి? దానిని ఏ ఉద్దేశంతో తీస్తున్నారు? అనే విషయాలను గమనిస్తే- తేజ చేసింది మంచిపనేనా? కాదా అనే విషయం అర్థమవుతుంది. ‘పోయినాళ్లందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు’.. అంటాడు మహాకవి ఆత్రేయ. ఒక మనిషి వదిలి వెళ్లిన వారసత్వాన్ని చూసే ఒక కోణం ఇది. ‘చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవటం’ అనే మరో సామేత కూడా ఉంది. వారసత్వాన్ని నెగిటీవ్‌గా చూసే మరో కోణం ఇది.
ఎన్టీఆర్‌పై తీస్తున్న బయోపిక్‌లను ఈ రెండు కోణాల నుంచి చూద్దాం. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్‌ది ఒక విశిష్టమైన స్థానం. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు- ఇలా అన్ని రకాల సినిమాల్లోను నటించిన ఆయనది ఒక భిన్నమైన శైలి. కాలంతో పాటుగా మారుతూ.. కొత్త కొత్త ప్రయోగాలు కూడా ఆయన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి సునామీలా వచ్చిన ఎన్టీఆర్ కొన్ని ప్రజాకార్షక పథకాలను ప్రవేశపెట్టారు. బీసీలు, ఇతర వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించటంలో ఆయన పాత్ర విశిష్టమైనది.
ఈ రెండింటితో పాటుగా కమ్మకులస్థులకు రాజ్యాధికారాన్ని అందించింది కూడా ఆయనే! కేవలం రాజ్యాధికారం అందించటమే కాదు.. దేశ రాజకీయాల్లో కూడా వారికి ఒక పాత్ర కల్పించినది ఎన్టీఆరే. ఈ మూడు కారణాల వల్ల ఆయనకు తెలుగు ప్రజల చరిత్రలో ఒక స్థానముంది. అయితే ఆయనకు మరో వ్యక్తిగత కోణం కూడా ఉంది. పన్నెండు మంది పిల్లలు ఉన్నా.. ఎవరూ చూడని పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవాల్సి రావటం.. ఆమె రాకతో అప్పటి దాకా ఉన్న కోటరీ చెల్లాచెదురయిపోవటం.. ఆ తర్వాత ఆ కోటరీ తిరుగుబాటు.. పదవీచ్యుతి.. ఇవన్నీ ఒక దాని వెనక ఒకటి జరిగిపోయాయి.
ప్రస్తుత యువతరానికి ఎన్టీఆర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 70, 80లలో పుట్టిన వారికి (ఇప్పుడు 40,50లలో ఉన్న వారికి) ఆయన గురించి ఎంతో కొంత తెలుసు. తమకు అనుకూలంగా ఉన్న ఇమేజ్‌లను బలపరచటం.. ప్రతికూలంగా ఉన్నవాటిని పరిహరించటం వారసులకు ఎంతో అవసరం. బహుశా బాలకృష్ణ ఈ బాధ్యతను తన భుజాల మీదకు ఎత్తుకున్నారు.
ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం (ఈ కారణాలను వేరేగావిశ్లేషించుకుందాం) పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి, అనుభవం అనే రెండు అంశాలు చాలవు. వీటికి తోడుగా ప్రజలకు మేలు చేసిన గత చరిత్రను కూడా పదే పదే చెప్పాల్సిన అవసరముంది. దీనికి సినిమా మీడియం కన్నా శక్తివంతమైనదేముంటుంది? అంతే కాకుండా ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం నాయకుల లేమితో బాధపడుతోంది.
జాగ్రత్తగా గమనిస్తే- ప్రజలకు అంతో.. ఇంతో మేలు చేశామని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగల రాజకీయ నాయకులు బహుశా పది మంది కూడా ఉండరు. అందరూ ప్రజలను ఏదో ఒక ఆశల పల్లకిలో ఎక్కించి ఊరేగిద్దామనుకొనేవారే. (ఇది అధికారపక్ష, విపక్షాలకు కూడా వర్తిస్తుంది). జగన తన నాన్న వైఎస్సాఆర్ వారసత్వాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు.. చంద్రబాబుకు, తెలుగుదేశానికి ఒక బలమైన వారసత్వం కావాలి. అది ఎన్టీఆర్ అయితే మంచిది.
అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే- బాలయ్య తీస్తున్న బయోపిక్‌లో సినిమాలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయని అర్థమవుతోంది. (బహుశా వివిధ హీరోయిన్లతో ఆయనకు ఉన్న సంబంధాలు.. కృష్ణకుమారి ఉదంతం.. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు సహజంగానే ఉండకపోవచ్చు). పైగా బాలయ్య చిత్రవిచిత్ర ధోరణి ఎలాగూ ఉంటుంది. అలాంటి సినిమా అన్ని వర్గాలను మెప్పించటం చాలా కష్టం.
గతంలో ఎమ్జీఆర్.. కరుణానిధిల స్నేహం.. ఆ తర్వాత వైరంపై తీసిన ఇద్దరు సినిమా దారుణమైన ప్లాప్ అయిన సంగతి తెలుసు. అంతే కాకుండా సినీ నటుల జీవితాలపై బయోపిక్‌లు తీసి మెప్పించటం చాలా కష్టం. వారి జీవితాల్లో వెలుగులు మాత్రమే కాదు. చీకటి కోణాలు కూడా ఉంటాయి. వీటిని సహజంగానే పరిహరిస్తారు. దీని వల్ల కథలో సహజత్వం ఉండదు.
అంతే కాదు- బాలీవుడ్‌లో కొంత వరకూ తప్పుల గురించి మాట్లాడటానికి ఇష్టపడతారేమో కానీ.. వ్యక్తి పూజకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే టాలీవుడ్‌లో హీరోలందరూ సర్వగుణాభిరాముళ్లే. తప్పు చేస్తే పక్కవారే చేస్తారు తప్ప వారు చిన్న పొరపాటు కూడా చేయరు. అలాంటప్పుడు ఈ సినిమా- కమ్మ వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
తమ కులానికి చెందిన వ్యక్తి ఒకప్పుడు గొప్పవాడనే విషయాన్ని ప్రస్తుత తరానికి చెప్పటానికి వీలవుతుంది. ఇక ఈ పాత్రకు బాలయ్య ఏ మేరకు సరిపోతాడనే విషయం కూడా సందేహాస్పదమే! (రామరాజ్యం సినిమా ఇలాంటి వికటించిన ప్రయోగమే! అందులో నీలం రంగు పూసుకొని.. నడ్డి మీద పుట్టుమచ్చ పెట్టుకున్న బాలయ్య వృద్ధ రాముడిలా కనిపించాడు). ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారంలో తేజ బయటకు వచ్చేసి మంచి పనే చేశాడు. లేకపోతే భవిష్యత్తులో అనేక అపవాదులు మోయాల్సి వచ్చేది.
– భావన