ఏ వ్యాపారంలో అయినా రాజకీయాలు కామన్. సినిమా రంగం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇటీవల అమెరికాలో తెలుగు సినిమా వ్యాపారం బాగా పుంజుకుంది. హిట్ కొడితే కోట్లు వచ్చి పడుతున్నాయి. ఫట్ మంటే కోట్లు పోతున్నాయి. ఈ సంగతి ఎలా వున్నా, ఇలా ఎప్పుడయితే ఓవర్ సీస్ లో తెలుగు సినిమా బిజినెస్ పెరిగిందో, అక్కడ రాజకీయాలు కూడా అంతకు అంతా పెరిగాయి. సినిమా రేటు సంగతి అలా వుంటే, ఒకసారి ఎవరో ఒకరు సినిమాను కొనేసిన తరువాత మిగిలన వాళ్లు తెర వెనుక వ్యవహారాలు షురూ చేస్తున్నారు.
ఒకటి కాదు, రెండు కాదు, ఓవర్ సీస్ ఇప్పుడు తెలుగు సినిమాల గ్యాసిప్ లకు పుట్టినిల్లుగా మారుతోంది. ఓవర్ సీస్ జనాలు నేరుగా సినిమా నిర్మాతలతో, డైరక్టర్లతో టచ్ లో వుంటారు. అలాగే ఇక్కడి మీడియా జనాలతో కూడా కాస్త టచ్ లు పెరిగాయి. దీంతో ఒకరి సినిమా మీద ఇంకొకరు గ్యాసిప్ లు వదలడం ప్రారంభిస్తున్నారు. అంతకు కొన్నాం అని ఓ బ్యాచ్ వార్త వదిలితే, అబ్బే అంతలేదు అంటూ ఇంకో బ్యాచ్ ఫీలర్లు వదుల్తుంది. ఎందుకంటే వాళ్లకు అంతకు తగినట్లు బిజినెస్ కాకూడదు.
మరోపక్క సినిమా ఇన్ సైడ్ టాక్ అంటూ మెల్లగా పీలర్లు వదులడం ప్రారంభమవుతుంది. సినిమా అంత లేదట. రీ షూట్ అంట, లేట్ అవుతుందట, కాంపిటీషన్ కు వెనక్కు తగ్గుతున్నారంట. బ్యాక్ అవుతున్నారంట అంటూ. దీంతో సినిమాకు ప్రీమియర్ బజ్ కాస్తా పడిపోవాలన్నమాట.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే డిస్కషన్ పాయింట్. ఓవర్ సీస్ వాళ్ల రాజకీయాలు కాదు కానీ, సినిమాలపై అక్కర్లేని గ్యాసిప్ లు పుట్టుకువస్తున్నాయని, అవి ఇక్కడి బిజినెస్ ను కూడా దెబ్బ తీస్తున్నాయని ఇండస్ట్రీ జనాలు వాపోతున్నారు. ఓవర్ సీస్ లో ముగ్గురు నలుగురు పెద్ద బయ్యర్లు వున్నారు. వీళ్లు ఒకరు సినిమా కొంటే మరొకరు తెర వెనుక గ్యాసిప్ లు పుట్టిస్తున్నారని ఇక్కడ సినిమా జనాలు చెప్పుకుంటున్నారు. సినిమా కొనడానికి ముందు, ఎవ్వరూ కొనడం లేదని, రేటు పలకడం లేదని, తీరా కొన్న తరువాత బ్యాక్ అవుట్ అవుతున్నారని, అయిన కాడకి అమ్మేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
డొమెస్టిక్ మార్కెట్ లో బయ్యర్లు అంతా ఒక తాటిపై వుంటున్నారు. ఓవర్ సీస్ మార్కెట్ లో మాత్రం సీన్ వేరేగా వుంది. ఇంకో సమస్య ఏమిటంటే డొమెస్టిక్ మార్కెట్ లో బయ్యర్లు గ్యాసపి లు పుట్టించలేరు. వాళ్లు జిల్లాల్లో వుంటూ ఇక్కడే వున్నా, మీడియాతో వాళ్లకి పెద్దగా టచ్ వుండదు. అందువల్ల వార్తలు పుట్టించలేరు. కానీ ఓవర్ సీస్ బయ్యర్లు అలా కాదు. వాళ్లకి దాదాపు కీలకంగా వుండే వెబ్ మీడియా అందరి తోటీ పరిచయాలే. దాంతో చాలా తెలివిగా ఫీలర్లు ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇదెక్కడి తలనొప్పి అని తల పట్టుకుంటున్నారు సినిమా జనాలు.