బాద్ షా కాస్త ఓకె కానీ ఓవర్ బడ్జెట్ దెబ్బ తీసింది. ఇద్దరమ్మయిలతో కూడా గిట్టుబాటు కాలేదు. గోవిందుడు అందరివాడేలే ఫరవాలేదు. దీంతో నిర్మాత బండ్ల గణేష్ చాలా జాగ్రత్తగా టెంపర్ ను ప్లాన్ చేసినట్లు వార్తలు వినవచ్చాయి. ఎన్టీఆర్, పూరి తమ తమ పారితోషికాలను తగ్గించుకున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాతే సినిమా సెట్ పైకి వెళ్లిందన్నారు. దాదాపు మూడు వంతుల షూటింగ్ గోవాలోను, హైదరాబాద్ లోనూ చేసారు కాబట్టి, బడ్జెట్ కంట్రోలు లోనే వుందనుకున్నారు.
కానీ టెంపర్ సినిమా బడ్జెట్ ముఫై అయిదు కోట్ల వరకు వుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతకన్నా కాస్త ఎక్కువే వుండచ్చంటున్నారు. పారితోషికాలు అన్నీ కలిపి మహా అయితే పదిహేను నుంచి ఇరవై వరకు వుంటాయి. మేకింగ్ కు మరి ఎంత అయి వుంటుందో? కానీ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం పివిపి సంస్ధ దగ్గర ఈ సినిమా కోసం ముఫై కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఆ విధంగా పెద్ద సాహసమే చేస్తున్నారనుకోవాలి.
ఇప్పుడు ఇండ్రస్ట్రీలో పెద్ద నిర్మాతల సంఖ్య అలా అలా తగ్గిపోతోంది. బండ్ల గణేష్ లాంటి ఒకరిద్దరు మిగిలారు. వాళ్లు కూడా ఇలా భారీగా ఖర్చులు పెట్టి, కష్టంలో పడితే, రేపు కొత్తవాళ్లు రావాలి తప్ప, సీనియర్ నిర్మాతలు కనిపించరు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ ముఖ్యం.