థని ఒరువన్..తమిళ్ లో సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాను ఏరి కోరి తెచ్చుకుని మరీ ధృవ అంటూ రీమేక్ చేస్తున్నాడు హీరో రామ్ చరణ్. థని ఒరువన్ సినిమాలో హీరో కన్నా విలన్ అరవింద్ స్వామికే ఎక్కువ ప్రాధాన్యతతో వుంటుంది. అలాగే సినిమా అంతా ఓ మైండ్ గేమ్ మాదిరిగా నడుస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోకు కూడా ప్రాధాన్యత వుండేలా, అదే విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ఆసక్తికరమైన విషయాలు వుండేలా దర్శకుడు సురేందర్ రెడ్డి కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసి, ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
థని ఒరువన్ వున్నది ఉన్నట్లు తీస్తే, తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదని, అందుకే మార్పులు చేయాలని భావించి, ఆ విధంగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులు బాగుంటాయో, లేదో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.