పవన్కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేదాకా, ఆ సినిమా మీద అభిమానులకే నమ్మకాలుండని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక, సినిమాలు చేయడం కష్టమేనని చిరంజీవి అనుకున్నారు, అన్నమాటకు కట్టుబడి సినిమాలు చేయలేదు. తీరిక చూసుకుని, ఇదిగో.. ఇప్పుడే ఆయన మొహానికి రంగేసుకుంటున్నారు. పవన్కళ్యాణ్ అలా కాదు, నచ్చినప్పుడు సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకుంటారంతే. దటీజ్ పవన్కళ్యాణ్.
ఏడాదికి పవన్కళ్యాణ్ ఓ సినిమా చేస్తే అది అద్భుతమే. కానీ, ఎందుకో ఆ మధ్య వరుసగా సినిమాలు చేసెయ్యాలనుకున్నారాయన. అంతలోనే మళ్ళీ బండి 'స్లో' అయిపోయింది. కాదు కాదు, ఆగిపోయింది. మళ్ళీ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో ఏమో. ఎస్జె సూర్య దర్శకత్వంలో సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది, సినిమా అటకెక్కేసింది. 'గోపాల గోపాల' సినిమా టైమ్లో డాలీతో ఏర్పడ్డ పరిచయం కారణంగా, తడుముకోకుండా పవన్ మళ్ళీ అతనికి ఛాన్సిచ్చాడు.
కానీ, డాలీ విషయంలోనూ కన్ఫ్యూజన్ మొదటికి వచ్చేసింది. దాదాపుగా చిరంజీవి, పవన్కళ్యాణ్ ఒకేసారి తమ తమ సినిమాల్ని మొన్నీమధ్యనే లాంఛనంగా ప్రారంభించారు. చాలా టైమ్ తీసుకున్నా, చిరంజీవి సెట్స్ మీదకు వెళ్ళిపోయారు. పవన్కళ్యాణ్ సినిమా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యింది. డాలీ కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనీ, వీరిద్దరూ కాదు హరీష్ శంకర్ అనీ, మరో దర్శకుడనీ ఏవేవో గాసిప్స్ తెరపైకొస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా పవన్కళ్యాణ్ ట్విట్టర్ పిట్ట కూడా స్పందించడంలేదు. జనసేన పార్టీ విషయంలోనూ అంతే. మొత్తం కథంతా పవన్కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుంటుంది అది సినిమా కథ అయినా, పొలిటికల్ కథ అయినా. లేకపోతే, ఇన్ని గాసిప్స్ వస్తున్నందుకు పవన్కళ్యాణ్ తరపున ఎవరో ఒకరు తదుపరి సినిమాపై స్పష్టత ఇవ్వాలి కదా. కానీ, ఇవ్వరు. ఎందుకంటే అక్కడున్నది పవన్కళ్యాణ్. ఆయన మూడ్ ఏ టైమ్లో ఎలా వుంటుందో ఎవరికి మాత్రం ఎరుక.?