టాలీవుడ్ లో మరో సంచలనం నమోదు అయ్యేలా వుంది. అయితే అది సినిమాల పరంగా కాదు. లుకలుకల పరంగా. గతంలో మా సంఘంలో లుకలుకలు బయటపడ్డాయిు. నిధులు అటు ఇటు అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఇంకా చాలా చాలా వినిపించాయి. ఇప్పుడు అదే విధంగా డైరక్షన్ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ పై కొన్ని కబుర్లు వినిపిస్తున్నాయి. అయితే అవి నిజమా కాదా అని తేలాల్సి వుంది.
ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లకు కొత్తగా స్థలాలు ఇస్తుందని టాక్ వినిపించడం, డబుల్ బెడ్ రూమ్ ల వ్యవహారం, ఇతరత్రా లాభాలు ఈ స్కామ్ కు దారితీసినట్లు వినికిడి.
సాధారణంగా డైరక్షన్ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ లో సభ్యత్వం అంత వీజీ కాదు. కార్యవర్గంతో సంబంధం లేకుండా స్క్రీనింగ్ కమిటీ అంటూ ఒకటి వుంటుంది. ఏయే సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసారో ధృవపత్రాలు జతచేస్తూ, సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తెరపై పేరు పడిందో లేదో చెక్ చేసి, అన్నీ పక్కాగా వుంటే మెంబర్ షిప్ ఇస్తారు.
అయితే ఇటీవల ఇలాంటి వ్యవహారాలు ఏమీ లేకుండానే పెద్ద సంఖ్యలో సభ్యులుగా కార్డులు ఇచ్చేసారని వదంతులు వినిపిస్తున్నాయి. దీనివెనుక కార్యవర్గంలోని , సిబ్బంది లోని కొందరి పాత్ర వున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసారని కృష్ణానగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలా సభ్యత్వం పొందిన వారు ఎక్కడా ఏ సినిమాకు పని చేసిన దాఖలాలు కానీ, ఎవరి దగ్గర పని చేసిన దాఖలాలు కానీ లేవని ఆ గుసగుల్లోని అదనపు సారాంశం. కానీ వారి పేరు, విడుదలైన కొన్ని సినిమాల పేర్లకు జోడించేసారట. అలా ఒక్కోసినిమాకు పాతికి ముఫై మంది అసిస్టెంట్ ల ఫేర్లు జోడించేసారట.
ఇదిలా వుంటే డైరక్షన్ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ లో నిధుల గోల్ మాల్ కూడా జరిగిందని సభ్యులు గుసగుసలు గా చెప్పుకుంటున్నారు. అక్కౌంట్స్ లో సరైన వివరాలు లేవని, మ్యారేజ్ గిఫ్ట్ అని రాసేసి వేలకు వేలు ఖర్చు చూపించారని కొందరు సభ్యులు తమలో తాము చర్చించుకుంటున్నారు. అందుకనే జనవరి 14న జరగాల్సిన జనరల్ బాడీ సమావేశం ఇంత వరకు ఏర్పాటు చేయలేదంటున్నారు. మా ఎన్నికల్లో కీలక పాత్ర వహించిన ఓ నటుడు కమ్ దర్శకుడే ఈ అసోసియేషన్ వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర వహించారని వదంతి వినిపిస్తోంది.
త్వరలో ఈ వ్యవహారంపై మీడియాకు కొందరు అన్ని వివరాలు వెల్లడించే అవకాశం వుందని తెలుస్తోంది.