కరోనా కాదు కానీ, టాలీవుడ్ లో అంతా కిందా మీదా అవుతోంది. కోట్ల రూపాయల టర్నోవర్ ఆగిపోయింది. పెద్ద, చిన్న సినిమాలు అన్నీ ఆగిపోయాయి. అంతా అయోమయం,అగమ్య గోచరంగా వుంది. ఇది చాలదన్నట్లు రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఎవరెవరికో కరోనా లక్షణాలు వున్నాయంటూ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సినిమా ఆఫీసులు చాలా వరకు తాళం పడ్డాయి. దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. నిన్నటికి నిన్న ఓ సీరియల్ లో నటించే నటుడికి కరోనా పాజిటివ్ రావడంతో సీరియళ్ల షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ రోజు ఓ యువ హీరో కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు వినిపించాయి. ఈ వెర్సటైల్, అప్ కమింగ యంగ్ హీరో కుటుంబంలో కూడా కరోనా వచ్చిందన్న వార్తలు నిజమైతే, టాలీవుడ్ లోకి కరోనా ప్రవేశించినట్లే అనుకోవాలి.
ఒకపక్క నిర్మాతలు ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. స్టాప్ కు సగం అయినా జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. థియేటర్ల సిబ్బందికి నలభై శాతం లేదా మినిమమ్ జీతాలు ఇస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం కనిపించడం లేదు. ఇలాంటి టైమ్ లో కరోనా ఈ రేంజ్ లో విజృంభిస్తే, షూటింగ్ లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో అన్నది అస్సలు ఊహకు అందడం లేదు.