ఏ మొగుడు లేకపోతే, అక్క మొగుడే గతి అని వెనకటికి ఓ మోటు సామెత. టాలీవుడ్ లో పరిస్థితి అలాగే వుంది. కొత్తనోట్లు లేవా? సరే పాతవే ఇవ్వండి అంటున్నారు.
బాకీలకో, ఫంక్షన్ల నిర్వహణకో, లేదా చిన్న చిన్న సెటిల్ మెంట్లకో నిర్మొహమాటంగా పాత నోట్లు తీసుకుంటున్నారట. అంతే కాదు, కొన్ని సినిమాలకు కట్టాల్సిన డబ్బులు కూడా పాత నోట్లతో కట్టినా ఓకె అంటున్నారట.
మరి ఏ విధంగా మార్చుకుందామనే భరోసానో? డిసెంబర్ చివరిదాకా టైమ్ వుంది. ఎలా లేదన్నా కొన్ని వారాలన్నా గడువు పెంచడం గ్యారంటీ. ఈలోగా ఎక్కడో అక్కడ ఏదో విధంగా మార్చేసుకుందామనే ధోరణిలో వున్నారట సినిమా జనం. అందుకే పాత నోట్లు యథావిధిగా చాలా వరకు చలామణీ అవుతున్నాయని తెలుస్తోంది.
గతవారం, పైగా డబ్బులు వైట్ లోనే తీసుకుంటాం..ఇస్తాం అని రెండు వైపులా డిసైడ్ అయినా నోట్లు దొరికే పరిస్థితి లేదు. పైగా కరెంట్ ఖాతాల వాడకం పై కూడా కొంత పరిమితి విధించారు. ఇక మిగిలిన అవకాశం ఒక్క ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే. అందుకే సరే, తరువాత చూసుకుందాం, లేదా ఇప్పుడు ఇవి ఇచ్చి, తరువాత కొత్తవి ఇస్తాం, లేదూ పాతిక శాతం అదనంగా ఇస్తాం, ఇలా రకరకాల ఒప్పందాలతో పాత నోట్లు స్మూత్ గా చలామణీ అయిపోతున్నాయట.
సినిమా అంటే సవాలక్ష మంది జనం, సవాలక్ష పరిచయాలు, సవాలక్ష వ్యవహారాలు అందుకే పాత నోట్ల వ్యవహారం ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. కానీ ఒకటే షూటింగ్ దశలో వున్న చిన్న సినిమాలకు మాత్రం బ్రేక్ పడింది అంతే.