టాలీవుడ్‌ తరలి వెళ్ళిపోతుందనేనా.?

'తెలుగు సినీ పరిశ్రమని టార్గెట్‌ చెయ్యలేదు..' అంటూనే, 'టార్గెట్‌' చేసేశారు డ్రగ్స్‌ కేసులో. 'తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోతుందనే సంకేతాలు పంపుతున్నారు..' అంటూనే, ఆ భావన వచ్చేలా చేసేశారు. పక్కా ప్లానింగ్‌తో తెలుగు…

'తెలుగు సినీ పరిశ్రమని టార్గెట్‌ చెయ్యలేదు..' అంటూనే, 'టార్గెట్‌' చేసేశారు డ్రగ్స్‌ కేసులో. 'తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోతుందనే సంకేతాలు పంపుతున్నారు..' అంటూనే, ఆ భావన వచ్చేలా చేసేశారు. పక్కా ప్లానింగ్‌తో తెలుగు సినీ పరిశ్రమను 'డ్రగ్స్‌ కేసులో' భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నమైతే జరిగింది. 

నిజానికి టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు ఈనాటివి కావు. ఎప్పటినుంచో జరుగుతున్న తంతు ఇది. రాత్రికి రాత్రి ఈ వ్యవహారం ఎలా హైలైట్‌ అయ్యింది.? అని ఆలోచిస్తే మాత్రం, తెరవెనుక పక్కా వ్యూహాలు అర్థమవుతాయి. ఏమయ్యిందో, ముఖ్యమంత్రి నోట 'టాలీవుడ్‌ని టార్గెట్‌ చేశామనడం సరికాదు. సినీ పరిశ్రమలోనివారిని వేధించం. వారిని బాధితులుగానే చూస్తాం. బాధితులు నేరస్తులు కారు..' అన్న మాట వచ్చింది. 

అసలేం జరిగింది.? కొందరు సినీ ప్రముఖులకు రెండో దఫా నోటీసులు అందనున్నాయనీ, నోటీసులు అందుకోనున్నవారిలో 'పెద్దలు' వున్నారనీ ప్రచారం జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనని ఎలా అర్థం చేసుకోవాలా.? ఇదిప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అమరావతికి తరలివెళ్ళిపోతుందంటూ తెలుగు సినీ పరిశ్రమ గురించిన ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికైనా తరలి వెళ్ళడం అంత తేలిక కాదు. అలాగని, అసాధ్యం కూడా కాదు. 

సినీ పరిశ్రమకు 'అనుకూల వాతావరణం' ఎక్కడ వుంటే, అక్కడ అది అలా పాతుకుపోతుంది. పరిస్థితులు వెక్కిరిస్తే, ఆటోమేటిక్‌గా ఇంకో 'ప్లేస్‌'ని సినీ పరిశ్రమ చూసుకుంటుందన్నది నిర్వివాదాంశం. 'తెలుగు సినీ పరిశ్రమలో చీలిక.. తెలుగు సినీ పరిశ్రమ టార్గెట్‌..' అంటూ ప్రచారం జరుగుతున్న వేళ తొలుత లైట్‌ తీసుకున్న తెలంగాణ సర్కార్‌, ఆ తర్వాత కంగారుపడింది.

తెలుగు సినీ పరిశ్రమ ద్వారా వచ్చే 'ఆదాయం' ఇక్కడ కీలకం. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలూ తెలుగు సినీ పరిశ్రమ చుట్టూ చాలానే వుంటాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, తెలుగు సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారనుకోవాలి. అంటే, ఇకపై డ్రగ్స్‌ కేసు నీరుగారిపోయినట్టేనా.? కొత్తగా సినీ ప్రముఖులకు నోటీసులు ఆగిపోయినట్టేనా.? ఇంతకీ, ఈ వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పిన 'పెద్దలు' ఎవరు.? ఏమో మరి, అంతా ఆ 'పైవాడికే' ఎరుక.