సుబ్బి పెళ్లి ఎంకి కి సమస్య గా మారినట్లు, పెద్ద నోట్ల రద్దు అన్నది టాలీవుడ్ కు పెద్ద తలకాయనొప్పగా మారిపోయింది. నిన్నటికి నిన్న హుటాహుటిన వందల కోట్లు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిపోయినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. అక్కడ వివిధ మార్గాల ద్వారా 20 పర్సంట్ కమిషన్ పద్దతిలో చేతులు మారాయని, కొంత మొత్తం ప్రామిసరీ నోట్లుగా, మరి కొంత భూముల అగ్రిమెంట్లుగా, ఇంకొంత బ్యాంకు బకాయిలు తీర్చడానికి ఇలా చకచకా మారిపోయినట్లు కబుర్లు వినిపిస్తున్నాయి.
వీటిలో నిజం పాలు ఎంత అన్నది ఎలా వున్నా, అలా వెళ్లడానికి అయితే ఆస్కారం వుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. నిర్మాతల దగ్గర డబ్బులు లేకున్నా, కొందరు డైరక్టర్లు, హీరోలు, కొన్ని ప్రొడక్షన్ హవుస్ ల దగ్గర బాగానే డబ్బు వుందని, అవే ఇలా ఆంధ్ర దారి పట్టాయని టాక్. హుటాహుటిన రోడ్డు మార్గంలో విజయవాడకు చేరి, అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు చేరాయని తెలుస్తోంది.