వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో హీరోయిన్ త్రిషకు నిశ్చితార్థం అయ్యింది. దక్షిణాదికి సుపరిచితమైన హీరోయిన్ ఆయనతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతోంది. మరి త్రిష భర్త వ్యాపారవేత్త అంటే.. ఏదో చోటా మోటా బిజినెస్ మ్యాన్ అనుకొన్నారంతా. అయితే ఆయన ఆయన రేంజ్ ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.
ఐపీఎల్ లో చెన్నై ప్రాంచైజ్ ను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నాడట వరుణ్ మణియన్. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉంటూ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గా ఉండటాన్ని కోర్టు సహించలేకపోయింది. ఏదో ఒక దానికే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ పై హక్కులు వదులు కోవాల్సి వస్తోంది. దీంతో ఆ ప్రాంచైజ్ ను మళ్లీ వేలం వేయనున్నారు.
ఈ వేలంలో వరుణ్ మణియన్ పాల్గొననున్నారట. మరి ఐపీఎల్ రంగంలోకి దిగడం అంటే మామూలు విషయం కాదు. ఏడాదికి తక్కువలో తక్కువ వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేంత దమ్మున్నవాళ్లే ప్రాంచైజ్ ల కొనుగోలు పట్ల ఆసక్తిని చూపిస్తారు. మరి ఆ వంద కోట్ల రూపాయల్లో ఎంత వెనక్కు వస్తుందో కూడా అర్థం కాని విషయమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లలోని అన్ని ప్రాంచైజ్ లూ దాదాపు నష్టాలనే చవి చూస్తున్నాయి. అయితే గ్లామర్ కోసం ఈ ప్రాంచైజ్ లు నిర్వహిస్తున్నారంతా.
యజమానులందరికీ వేరే వ్యాపారాలున్నాయి.. వాటిల్లో లాభాలు వస్తుండటంతో వారు ఐపీఎల్ లో నష్టాలను తట్టుకొంటున్నారు. దీన్నిబట్టి మరి త్రిష భర్తది కూడా ఏడాదిలో వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి లాభాలు ఆశించని రేంజ్ అనమాట. మరి దీన్ని బట్టి త్రిష ఛాయిస్ ఏ స్థాయిలో ఉందో సులభంగా అర్థం అవుతోంది. ఈ వరుణ్ మణియన్ కు శ్రీనివాసన్ సమీప బంధువు కూడా నట. మరి త్రిష చాలా పెద్దింటి కోడలుగానే వెళుతోందనమాట!