పొగిడే విషయంలో సినిమా వాళ్లను దాటి ఎవరూ పోలేరు. ఇది అక్షరసత్యం. ఎవర్నయినా టార్గెట్ చేస్తే అతడ్ని ఆకాశానికి, అవసరమైతే అంతరిక్షానికి ఎత్తేయడం సినిమావాళ్ల స్టయిల్. ఈ విషయంలో వాళ్లు ఆది, అంతం చూసుకోరు. త్రివిక్రమ్ కూడా అదే పనిచేశాడు. చిరంజీవిని, ఆయన సుపుత్రుడు రామ్ చరణ్ ను ఆకాశానికెత్తేశాడు. అయితే ఈ క్రమంలో త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదమయ్యాయి.
పొగిడే క్రమంలో వీరుడు, శూరుడు అనడం కామన్. అలానే చరణ్ ను సింహంతో పోల్చాడు త్రివిక్రమ్. సింహం రోజూ వేటాడదని, ఆకలి వేసినప్పుడు మాత్రం అడవిలోకి వెళ్తుందన్నాడు. అప్పుడు మాత్రం వేట సాలిడ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక్కడవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చేసిన కామెంట్స్ మాత్రం అంత బాగాలేవు.
సింహం తినగా వదిలేస్తే ఆ వేటతో చాన్నాళ్ల పాటు నక్కలు, హైనాలు పండగ చేసుకుంటాయని అన్నాడు త్రివిక్రమ్. నిజానికి అడవిలో జరిగేది ఇదే. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ కు అన్వయించే విషయంలో త్రివిక్రమ్ మాటలు తేడాకొట్టాయి.
తన వ్యాఖ్యలతో చరణ్ ను సింహంను చేసిన త్రివిక్రమ్, మిగతా హీరోల్ని నక్కలు, హైనాలతో పోల్చాడన్నమాట. రామ్ చరణ్ రికార్డులు సృష్టిస్తే, ఆ రికార్డుల్ని అందుకోవడానికి మిగతా హీరోలు చాన్నాళ్ల పాటు కష్టపడాలనే ఇన్నర్ మీనింగ్ తో త్రివిక్రమ్ మాట్లాడాడు.
పొగడాలి కాబట్టి చరణ్ ను ఆకాశానికెత్తేశాడు త్రివిక్రమ్. పైగా త్వరలోనే చిరంజీవితో సినిమా కూడా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఏదో ఒకరోజు చరణ్ తో కూడా సినిమా చేయాలి. కాబట్టి పనిలోపనిగా తండ్రికొడుకులు ఇద్దర్నీ తన మాటలతో మాయచేశాడు.
కానీ త్రివిక్రమ్ చెప్పినంత సీన్ చరణ్ కు లేదు. త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే టాలీవుడ్ లో చరణ్ మాత్రమే సింహం కాదు. ఇంకా చాలా సింహాలున్నాయి. అవి కూడా బాగానే వేటాడాయి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో కొన్ని సింహాల వేట స్థాయిని చరణ్ ఇంకా అందుకోలేదు కూడా.
త్రివిక్రమ్ కు ఇవన్నీ తెలియక కావు. అన్నీతెలిసే అలా మాట్లాడాడు. పొగడాలి కాబట్టి పొగిడాడు. కానీ చరణ్ ను సింహంగా, మిగతా హీరోల్ని నక్కలు, హైనాలతో పోల్చడం మాత్రం కచ్చితంగా తప్పు.