పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాసారు అంటే అది సమ్ థింగ్ స్పెషల్ గా వుండాలి. వుంటుందనే నమ్మకం అభిమానులకే కాదు అందరికీ. అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి కథ అందిస్తున్నారు అన్నదానిపై ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. ఓ చిత్రమైన నేపథ్యంలో హీరోరివెంజ్ స్టోరీని పవన్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే విషయం మాత్రం ఆసక్తి కరంగానే వుంది.
అంత ఆసక్తికరమైన కథా నేపథ్యం ఏమిటి? సినిమాలో హీరో తండ్రిది టిపికల్ క్యారెక్టర్. ప్రతి దానికీ ఓ ఆల్టర్ నేటివ్ లేదా స్టాండ్ బై వుండాలనుకునే రకం. అందుకే ఇద్దరు భార్యలు, రెండు బిజినెస్ లు, రెండు ఆఫీసులు, ఇలా ప్రతీదీ రెండు, రెండు, రెండు అన్నమాట. ఇలాంటి నేపధ్యంలో అతన్ని చంపేస్తారు శతృవులు. కానీ మొదటి భార్య పిల్లలు రివెంజ్ తీసుకునే రేంజ్ కాదు, అంత స్టామినా వున్నవారు కాదు. రెండో భార్య కుమారుడు పవన్. అప్పుడు మొదటి భార్య తన సవతి కొడుకైన పవన్ ను పిలిచి పగ తీర్చుకోమని కోరుతుందట. అప్పుడు ఏం జరిగిందన్నది మిగిలిన సినిమాగా తెలుస్తోంది. ఈ మరి ఈకథకు త్రివిక్రమ్ తన స్టయిల్ మసాలాలు, తాలింపులు ఎలా జోడించారో చూడాలి.
ఇప్పుడు ఇలాంటి సినిమాకు ఒకేలాంటి రెండు ఆఫీసు బిల్డింగ్ లు పక్క పక్కన కావాలి. అలాగే రెండు ఇళ్లు పక్క పక్కన ఒకేలాంటివి కావాలి. ఇళ్లయితే దొరుకుతాయి. కానీ ఆఫీసులు. అందుకే ఏకంగా కోట్ల బడ్జెట్ తో సెట్ వేసేయాలని అనుకుంటున్నారట. అందుకే ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేసారు. పైగా బాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్, కోలీవుడ్ సంగీత దర్శకుడు, పైగా పవన్ కు ముఫై, త్రివిక్రమ్ కు 20 కోట్లు రెమ్యూనిరేషన్ అని వినికిడి. అందువల్ల వంద కోట్లు కూడా చాలవేమో?