అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో హీరో పవన్ కళ్యాణ్ చాలా చిత్ర, విచిత్రమైన ప్రసంగం చేసారు. ఆ మధ్య చాలా రాజకీయ ప్రసంగాలు చేసినపుడు ఇట్నుంచి అటు, అట్నించి ఇటు ఎలా జంప్ చేస్తూ మాట్లాడినట్లే పవన్ ఈ సభలోనూ మాట్లాడారు. ఆయన మాట్లాడిన చాలా వాక్యాలకు కర్త,కర్మ, క్రియ లాంటి పద్దతులు లేవు. ఒక పదానికి మరో పదానికి పొంతన లేదు. ఒక దానితో స్టార్ట్ చేసి, మరో దాంతో ఎండ్ చేసారు.
భారత్ మాతాకీ జై అంటూ పొలిటికల్ సినిమాటిక్ గా ప్రసంగం స్టార్ట్ చేసిన పవన్ మధ్యలో వున్నట్లుండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు మళ్లారు. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు ఇస్తుంటారని, ఏదేదో అంటుంటారని, కానీ తనను చాలామంది ఒంటరి చేసేసినపుడు, పరాజయాల సమయంలో తనతో ఎవరూ లేనపుడు, త్రివిక్రమ్ అండగా నిలిచారని మొదలుపెట్టి, తెగ చెప్పుకువచ్చారు, తను చేయూత నిచ్చిన వాళ్లు, తాను అండగా నిలబడిన వాళ్లు తనతో వుండలేదు అని చెప్పారు.
తనను డిప్రెషన్ లోంచి త్రివిక్రమ్ నే బయటకు తీసుకువచ్చారని పవన్ వెల్లడించారు. త్రివిక్రమ్ కు తాను కాకపోతే, బోలెడు మంది హీరోలు దొరకుతారని అన్నారు. జల్సా హిట్ అయిందని, డబ్బులు వచ్చాయని, తనకు మరో మూడేళ్లకు కానీ తెలియదన్నారు.
ఎవర్నీ కోప్పడలేను కానీ, త్రివిక్రమ్ ను కొప్పడగలను అన్నారు. అంత సాన్నిహిత్యం వుందన్నారు. తనకు బలంగా అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్ అన్నారు. అందుకే ఆయనకు మనస్పూర్తిగా జోహార్లు అర్పిస్తున్నా అన్నారు. (బతికివున్నవాళ్లకు జోహార్లు అర్పించరు. పోయినవాళ్లకు తప్ప. పాపం పవన్ కు ఆ సంగతి తెలియదు అనుకోవాలి) ఇలా త్రివిక్రమ్ గురించి బోలెడు చెప్పిన తరువాత పవన్ మళ్లీ దారి తప్పారు.
అంతకు ముందు త్రివిక్రమ్ ఏ విధంగా, ఎలా అయితే సినిమాలో టెక్నీషియన్లకు, నటులకు థాంక్స్ చెప్పారో దాదాపు అదే మళ్లీ పవన్ వల్లె వేసారు. పవన్ ప్రసంగంలో ఏమిటో ఏమిటో మాట్లాడారు. ఒక దశలో పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థంకాలేదు. ఓటమికి కుంగిపోను అంటారు. వైరాగ్యం వచ్చిందంటారు. కోట కట్టుకున్నా అంటారు.
మొత్తంమీద ఈసారి పవన్ స్పీచ్ లో, తన రాజకీయం, సేవా గుణం, దేశంపట్ల తన ఆవేదన చెప్పాలన్న తపన, తన మనిషి తివిక్రమ్ పై ఇటీవల వినిపిస్తున్న గుసగుసలకు సమాధానం చెప్పాలన్న ఆలోచన కనిపించాయి తప్ప, సరైన సమగ్ర ప్రసంగం మాత్రం చేయలేకపోయారు.