పెద్ద సినిమాల మీదకు తమ సినిమాలు వదిలి హిట్ కొట్టడం అన్నది యూవీ క్రియేషన్స్ కు ఓ సరదాగా మారినట్లుంది. ఇప్పటికి మూడుసార్లు ఇదే తరహా గేమ్ కలిసి వచ్చింది. ఇప్పుడు నాలుగోసారి ట్రయ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 22న విక్రమ్ కుమార్-అఖిల్ ల కాంబీ మూవీ హలో మీదకు తమ దగ్గర చెక్కుతున్న శిల్పం లాంటి భాగమతిని వదలాలని చూస్తున్నట్లు బోగట్టా. అనుష్కతో బాహుబలి మొదలైన దగ్గర నుంచి చెక్కుతున్నారు యూవీ క్రియేషన్స్ లో భాగమతి సినిమాను. ఏం నచ్చి తీసుకున్నారో సబ్జెక్ట్ ను, డైరక్టర్, ఇదిగో అదిగో అంటూ నడుస్తోంది. ఆఖరికి ఇప్పడు చివరకు వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల లక్ష్యంగా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం తెలిసి నాగార్జున, వద్దని రిక్వెస్ట్ చేసాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి తన కొడుకు సినిమాను ఎలాగైనా హిట్ బాట పట్టించాలని నాగ్ అన్ని శక్తులు వాడుతున్నట్లు వినికిడి. సోలోగా విడుదల చేయించడం అన్నది అందులో ఒకటిగా తెలుస్తోంది.
అయితే విక్రమ్ కుమార్ సినిమా విడుదల పక్కనా కాదా అన్న అనుమానాలు కూడా ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పనులు చాలా వున్నాయంటున్నారు. బహుశా ఇది కూడా కారణం కావచ్చు, యూవీ భాగమతి ముస్తాబు చకచకా సాగడానికి?