వీరీ వీరీ గుమ్మిడి పండు, డ్రగ్స్ రెండో జాబితా ఏదీ? అంటే ఇప్పుడు ఫక్కున నవ్వే పరిస్థితి. మొదటి జాబితా, దానిమీద బోలెడన్ని వార్తలు, గుసగుసలు అన్నీ అయిపోయాయి. డజను మంది సినిమా జనాలను అంతకు మించి జనాలకు పరిచయంలేని వారిని విచారించారు. అలాగే బోలెడు మందిని అరెస్టు చేసారు. ఇక కోర్టులో చార్జిషీట్ పెట్టడం అన్న కార్యక్రమం మిగిలింది. ఇక్కడ రెండు వ్వవహారాలు వున్నాయి.
ఒకటి చార్జిషీట్ లో ఈ డజను మంది సెలబ్రిటీల ప్రమేయం గురించి ఏ మేరకు వుంటుందన్నది.
రెండవది. చార్జిషీట్ దాఖలు చేసేలోగా మరి కొంతమందిని విచారిస్తారా? అలా విచారించాలంటే, నోటీసులు ఇవ్వాలి కాబట్టి ఇస్తారా? అన్నది.
ఇక్కడి నుంచే రెండు వ్యవహారాలు తెరవెనుక ప్రారంభం అవుతాయి. ఒకటి, చార్జిషీట్ లో తమ మీద అభియోగాలు వీలయినంత తక్కువ వుండేలా చూసుకోగలగడం. రెండవది కొత్త వాళ్లకు నోటీసులు రాకుండా చూసుకోవడం.
ఈ రెండింటిలో రెండవది అప్పుడే అయిపోయినట్లు కనిపిస్తోంది. ఇదిగో రెండో జాబితా, అదిగో రెండో జాబితా అని మీడియా కోడై కూసింది. ఆ కూతే మిగిలేలా కనిపిస్తోంది. చార్మి కోర్టుకు వెళ్లగానే, తమ మీద విమర్శలు రాగానే ఎక్సయిజ్ కమిషనర్, డైరక్టర్ కలిసి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కానీ పన్నెండు మంది విచారణ అయిపోయిన తరువాత, ఇకపై ఏం చేయబోతున్నారన్నది మాత్రం వివరించలేదు. నిజానికి అలా వివరించాల్సిన అవసరంలేదు. కానీ అదే సమయంలో సబర్వాల్ వేరే వేదికల మీద మాట్లాడుతూ, రెండో జాబితా విషయమై తన మీద తీవ్రవత్తిడి వస్తోందని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
నిజంగా రెండో జాబితా, నోటీసులు ఇలాంటి వ్వవహారాలు వుంటే సబర్వాల్ లాంటి సిన్సియర్ అధికారులు ఇలా మాట్లాడరు. సైలెంట్ గా రెండో జాబితా జనాలకు నోటీసులు ఇచ్చేస్తారు. అదే విధంగా 12 మంది విచారణ పూర్తయ్యే వరకు రెండో జాబితాను నొక్కిపెట్టి వుంచరు. ఎప్పుడో ఇచ్చేసి వుండాలి. కానీ అలా చేయలేదు. మొదటి జాబితా నోటీసులు ఇచ్చి, వాళ్లు హాజరయ్యేందుకు టైమ్ ఇచ్చారు. మరి రెండో జాబితాకు అలా టైమ్ ఇవ్వాలి. అంటే మొదటి జాబితా విచారణతోనే రెండో జాబితా విచారణ కంటిన్యూగా సాగాలి అంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చి, విచారణ కొనసాగేలా చూసేవారు. కానీ అలా జరగలేదు.
అంటే రెండో జాబితా అనేది లేదనే దాదాపు అనుకోవాల్సి వస్తోంది. వుండి వుంటే, పోవీ 12మంది విచారణ పూర్తయిన సందర్భంగానైనా చెప్పి వుండేవారు. అదీ చేయలేదు. అంటే దీన్నిబట్టి రెండో జాబితా వుందనేదాని మీద సందేహాలు ముసురుకుంటున్నాయి. పైగా మొదటి జాబితా సగానికి వచ్చేసరికే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి తలసాని వరకు బోలెడు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. పైగా ఎక్సయిజ్ వారికి కేవలం సినిమారంగం వాళ్ల నెంబర్లు మాత్రమే దొరికాయా? పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల కుటుంబాల నెంబర్లు ఏవీ దొరకలేదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అందువల్ల ఇకపై రెండో జాబితా అనేది దాదాపు వుండదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మిగిలింది చార్జిషీట్. తొలి జాబితాలో వున్నవారి గురించి చార్జిషీట్ లో ఏమేరకు వుంటందన్నది కీలకం. అక్కడ కూడా సరిగ్గా లేకపోయినా, వున్న విషయం ప్రాసిక్యూషన్ కు నిలవకపోయినా, ఇక చేసేదేమి లేదు. చాలా మందికి క్లీన్ చిట్ రావడం మినహా.
అప్పుడు వుంటుంది మజా. పూరి, వర్మ లాంటి వాళ్లు మీడియా మీద ఓ లెక్కలో సెటైర్లు వేయడం గ్యారెంటీ? ఇంకా మాట్లాడితే మీడియా పీకిందేమిటి? అని ఆఫ్ ది రికార్డు గా అయినా కామెంట్ చేయడం గ్యారంటీ. దానికి మీడియా దగ్గర వున్న సమాధానం ఒక్కటే, ఆ వారం రోజుల పాటయినా టీఆర్పీ పెంచుకోగలిగాం అన్నది మాత్రమే. డ్రగ్స్ కొండను తవ్వలేదు. తవ్వినంత హడావుడి జరిగింది. తవ్వివుంటే ఎలక అయినా దొరికేదేమో? ఇప్పుడు అదీ దొరకలేదు.
-ఆర్వీ