ఉన్నది ఉన్నట్లుగా.. టార్గెట్ పూరి జగన్నాధ్?

నోరా, వీపుకు తేకే అని వెనకటికి సామెత. నోరు తన మానాన తాను మాట్లాడేస్తుంది కానీ జనం వీపుమీద ఒక్కటి వేస్తారు. అంటే నోరు బాగానే వుంటుంది. వీపు విమానం మోత మోగుతుంది. అందుకే…

నోరా, వీపుకు తేకే అని వెనకటికి సామెత. నోరు తన మానాన తాను మాట్లాడేస్తుంది కానీ జనం వీపుమీద ఒక్కటి వేస్తారు. అంటే నోరు బాగానే వుంటుంది. వీపు విమానం మోత మోగుతుంది. అందుకే నోరా.. వీపుకు తేకే  అన్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారం అచ్చం ఇలాంటిదే. ఆయన తన మానాన తాను తన నోటిని ట్విట్టర్ లోనో, ఇతర సామాజిక మాధ్యమాల్లోనో పారేసుకుంటారు. దానివల్ల ఫలితం మాత్రం పాపం, పూరి జగన్నాధ్ అనుభవిస్తారు.

నిజానికి దర్శకుడు పూరి జగన్నాధ్ కు తన గురువు రామ్ గోపాల్ వర్మ అంటే అత్యంత ప్రేమ అని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తుంటుంది. కష్టకాలంలో ఆర్థికసాయం కూడా చేసారని అంటారు. ఆ సంగతి ఎలావున్నా, టాలీవుడ్ లో అందరితో నవ్వుతూ వుంటూ, ఏ హీరోతో అయినా ఇట్టే చనువు సంపాదించగల పూరి జగన్నాధ్ ను ఇండస్ట్రీలో చాలా మందికి టార్గెట్ అయ్యేలా చేసింది మాత్రం రామ్ గోపాల్ వర్మే అనుకోవాలి.

మెగాస్టార్ తో మొదలు

చిరంజీవి 150వ సినిమా డైరక్ట్ చేసే అవకాశం పూరి జగన్నాధ్ కు ఎందుకో చేజారిపోయింది. ఊరుకుంటే పోయేది. ఇక మరి రామ్ గోపాల్ వర్మ అవకాశం దొరికినపుడల్లా ఖైదీ సినిమా మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరుచుకు పడుతూనే వున్నారు. దాన్ని తక్కువ చేయడం కోసం గౌతమిపుత్ర శాతకర్ణిని వెనకేసుకురావడం, మెగా హీరోల మీద తెగ సెటైర్లు వేయడం ఇలా ఒకటేమిటి, అనేకం చేసారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను తెగ ఎటాక్ చేసారు. ఆఖరికి నాగబాబు ఓపెన్ గా వర్మను టార్గెట్ చేస్తే తప్ప, దారిలోకి రాలేదు.

కానీ జనాలు రామ్ గోపాల్ వర్మ మీద కసి, కోపం పెంచుకోలేదు. దీనంతటికీ కారణం వెనుక పూరి జగన్నాధ్ అనుకుని, ఆయనపై వ్యతిరేకతను పెంచుకున్నారు. మెగాభిమానులు ఎక్కడపడితే అక్కడ పూరిని ద్వేషించడం కామన్ అయింది.

ఎన్టీఆర్ తో కూడా

మొన్నటికి మొన్న జై లవకుశ సినిమా టీజర్ బయటకు వచ్చిన తరువాత లీడింగ్ ఆంగ్ల పత్రికలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. పూరి కథను ఎన్టీఆర్ దొంగిలించేసాడు లేదా కాపీ కొట్టేసాడు అన్నట్లుగా. ఎప్పుడో పూరి చెప్పిన లైన్, ఇప్పుడు బాబీ చేస్తున్న సినిమా లైన్ కాస్త మ్యాచ్ కావడంతో వచ్చిన కథనం ఇది. ఈ కథనం వెనుక చార్మి వుందని గుసగుసలు బయటకు వచ్చాయి. చార్మి సంస్థ తనకు వున్న పరిచయాలు వాడి ఆ కథనం వచ్చేలా చేసిందని వదంతి వినిపించిది. దీంతో మెగా క్యాంప్ తో పాటు ఎన్టీఆర్ క్యాంప్ కూడా పూరికి వ్యతిరేకం అయింది. మెగా క్యాంప్ అయిపోయింది. ఎన్టీఆర్ క్యాంప్ అయిపోయింది.

కొంతమంది బయ్యర్లు

గతంలోనే కొంతమంది బయ్యర్లు లేదా పంపిణీదారులతో పూరి జగన్నాధ్ కు గొడవలు జరిగాయి. వీటిపై పూరి నేరుగా పోలీసుల దగ్గరకు కూడా వెళ్లారు. ఆ తరువాత అవి సద్దుమణిగినట్లు కనిపించవచ్చు కానీ, దెబ్బతిన్నవారు లోలోపల బాధపడుతూనే వుంటారు కదా? ఇలా కొంత సెక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ బిజినెస్ కూడా పూరికి దూరం అయింది. ఇక కెమెరామెన్ రాంబాబు టైమ్ లో పూరి రాసిన డైలాగులు వగైరాలు, ఆయనకు తెలంగాణ ఉద్యమకారులకు మధ్య చిచ్చు రగిల్చాయి. ఆనాటి ఆ గాయాల ఆనవాళ్లు ఇంకా వుండనే వున్నాయి.

కులాలు..పార్టీలు?

మొన్నటికి మొన్న విచారణ సమయంలో పూరి అన్నారు అంటూ కొన్ని కామెంట్లు బయట గ్యాసిప్ లుగా చక్కర్లు కొట్టాయి. తాను బీసీ అని (పూరి వెలమ వర్గానికి చెందినవారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని వెలమలు బీసీ రిజర్వేషన్ కేటగిరికి చెందిన వారు) టార్గెట్ చేస్తున్నారా? తన సోదరుడు వైకాపా పార్టీలో కీలకంగా (పూరి సోదరుడు నర్సీపట్నం నుంచి గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసారు) వున్నదున టార్గెట్ చేస్తున్నారా? అని పూరి ప్రశ్నించారన్నది ఆ వదంతులు సారంశం. అవి నిజమో కాదో, సిట్ జనాలకు తప్ప ఎవరికీ తెలియదు. 

కానీ టాలీవుడ్ లో మెజారిటీ జనాలు అటు తెలుగుదేశంతో, ఇప్పుడు తెరాసతో చెట్టాపట్టాలు వేసుకున్న, వేసుకుంటున్నవారే. అలాగే టాలీవుడ్ లోని రెండు కీలకవర్గాల్లోని వారు దాదాపుగా డ్రగ్స్ కేసులో లేరు. అందువల్ల ఇప్పుడు తమ ప్రస్తావన చేసారని తెలియడంతో ఆ వర్గాలకు కూడా పూరి టార్గెట్ అయ్యే అవకాశం వచ్చింది.

దీంతో టాలీవుడ్ లోని కీలకవర్గాల్లో ఒకవర్గానికి చెందిన బలమైన మీడియా ఇప్పుడు పూరిని బలంగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పూరి గతంలో ఎక్కువగా సాక్షితో అసోసియేట్ అయివున్నారు. ఆయన షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్ లు వగైరాలు అన్నీ సాక్షితోనే చేసారు. ఇప్పుడు విచారణ తరువాత కూడా సాక్షికే ప్రత్యేకమైన ఇంటర్వూ ఇచ్చారు. ఇవన్నీ కలిసి సాక్షి వ్యతిరేక మీడియాకు పూరిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

నిజంగా పేర్లు చెప్పారా?

ఇదిలా వుంటే సిట్ విచారణకు ముందే పూరి అన్నారంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మీకు రాయగల దమ్ముంటే, నాకు చెప్పగల దమ్మువుందీ అంటూ పూరి చెప్పారంటూ కొన్ని పేర్లు, కామెంట్లు బయటకు వచ్చాయి. అయితే ఆ తరువాత పూరి వాటివల్ల జరిగే డామేజ్ ను గమనించి ఖండించారు కూడా.

ఇప్పుడు లేటెస్ట్ గా సిట్ విచారణలో పూరి జగన్నాధ్ బోలెడు పేర్లు చెప్పారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా పూరి చెప్పిన పేర్లలో పలువురు సినీ సెలబ్రిటీల పేర్లు వున్నాయని టాక్. ఇవి నిజమో కాదో కానీ, ఇప్పుడు ఆ వర్గాలకు కూడా పూరి టార్గెట్ అవుతున్నారు. 

ఇలా మొత్తం మీద పూరి జగన్నాధ్ అన్ని విధాలా టార్గెట్ కావడంతో ఇప్పుడు ఆయన ఒంటరి అవుతున్నట్లు కనిపిస్తోంది.

-ఆర్వీ