హైదరాబాద్ అంటే ఐటి, సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు. ఇండస్ట్రియల్ హబ్. సినిమా జనాలను నిలబెట్టి కొనగల బడా బాబులు ఎందరో హైదరాబాద్ బిజినెస్, ఇండస్ట్రీ సర్కిల్ లో వున్నారు. వేలు, లక్షల కోట్ల డబ్బున్న ఆసామీలు వున్నారు. వాళ్ల పిల్లలది కూడా హై ఫై వ్యవహారమే.
ఇక పొలిటికల్ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కరే లేదు. వాళ్ల పిల్లల హల్ చల్ సంగతీ చెప్పక్కరలేదు. మందు కొట్టి చేసే రుబాబులు, కార్లు స్పీడుగా నడుపుతూ చేసే ప్రమాదాలు ఎన్నో. పైగా చాలా మంది సినిమా వాళ్ల పిల్లలకు ఈ బిజినెస్, ఇండస్ట్రీ, పొలిటికల్ సర్కిల్ పిల్లలకు భయంకరమైన దోస్తానా వుంది.
హీరోలు, బడా నిర్మాతల పిల్లలు అలాగే యంగ్ హీరోలతో పొలిటికల్, ఇండస్ట్రీయల్ సర్కిళ్ల వాళ్ల పిల్లలు చెట్టా పట్టాలేసుకుని తిరగడం, పబ్ లకు, పార్టీలకు వెళ్లడం చాలా కామన్. కానీ చిత్రంగా ఎక్సయిజ్ శాఖకు దొరికిన రకరకాల కాల్ లిస్ట్ ల్లో సినిమా జనాల ఫోన్ నెంబర్లు, కాల్ డేటా వున్నట్లుంది తప్ప, సదరు పొలిటికల్, ఇండస్ట్రియల్ జనాల కాల్ డేటా వున్నట్లు కానీ, అలా వున్నవాళ్లకి నొటీసులు ఇచ్చినట్లు కానీ ఎక్కడా సింగిల్ కాలమ్ వార్త అయితే రాలేదు.
అంటే ఇటు ఇండస్ట్రియల్ పీపుల్ కు టెన్షన్లు లేవని, వాళ్ల పిల్లలకు ఇలాంటి సరదాలు లేవనీ అనుకోవాలి అన్న మాట. రాజకీయ నాయకుల పిల్లలు అంతా సచ్ఛీలులు అని సంతోషించాలన్నమాట. సినిమా వాళ్లకు నోటీసులు ఇచ్చాం అని చెప్పిన ఎక్సయిజ్ అధికారులు, మరేమీ చెప్పలేదంటే రాజకీయ నాయకులు, బడా బాబుల పిల్లలు ఎవరూ లేరని అన్యాపదేశంగా చెప్పినట్లే. ఇది మనం నమ్మాలి. అంతే.