ఆ ఇద్దరూ గురుశిష్యులు. గురువు దగ్గర ఓనమాలు నేర్చుకున్న శిష్యుడు దర్శకుడిగా ఎదిగాడు. విజయాలు సాధించి గురువు పేరు నిలబెట్టాడు. పాతికేళ్లు గడిచాయి. గురువు సతీసమేతంగా శిష్యుడి సినిమా సెట్ కు వచ్చి ఓ సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
ఆ శిష్యుడు సవినయంగా తన గురువు దర్శకత్వం వహించే సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ‘వాళ్లిద్దరి మధ్య’ జరిగిన పాతికేళ్ల క్లాప్ కథ వెనుక ఉన్న పాత్రధారులు మరెవరో కాదు అలనాటి మేటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, ఈనాటి దర్శకుడు విఎన్ ఆదిత్య.
కాస్త ఎక్కువ గ్యాప్ నే తీసుకుని లేటెస్ట్ గా విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన‘బృందావనం’,‘భైరవద్వీపం’,‘శ్రీకృష్ణార్రున విజయం’ చిత్రాలకు వి.ఎన్.ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
ఈ సందర్భంగా సింగీతం సరదాగా సెట్ కు వచ్చారు. దాంతో శిష్యుడు మళ్లీ శిష్యుడిగా మారారు. అప్పుడు ఎలా క్లాప్ కొట్టారో… ఇప్పుడు మళ్లీ అలాగే తన సినిమాకు కూడా ఓ అసిస్టెంట్ మాదిరిగా కొట్టారు. గురువు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు .
ఈ మధురానుభూతి గురించి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ ‘’వాహిని సంస్థలో నేను కొట్టిన క్లాప్ అనుభూతి మళ్లీ ఇన్నాళ్లకు పునరావృతమైంది. నా గురువు సింగీతం గారు మొట్టమొదటిసారి నా సెట్ కు వచ్చారు. అప్పట్లో నాలుగేళ్లు ఆయన దగ్గరే ఉండి వాళ్లింట్లో భోజనంచేసి పెరిగిన కుర్రాడిని నేను’’ అన్నారు. ‘
వాళ్లిద్దరి మధ్య’ షూటింగ్ విశేషాల్లోకి వస్తే ఈ సినిమా షూటింగ్ నవంబరు 25 కల్లా పూర్తవుతుందని నిర్మాత అర్జున్ దాస్యన్ చెప్పారు.