ఆ మధ్య 'జిమికి కమల్..', ఇటీవల 'ప్రియా వారియర్..' ఇంటర్నెట్లో బాగా వైరల్‌గా మారిన వీడియోలు అవి. వందలు.. వేలతో మొదలై.. లక్షలు, కోట్ల సంఖ్యలో ఆ వీడియోలకు వ్యూస్ లభించాయి. సోషల్ మీడియాలో సునామీనే క్రియేట్ చేశాయి ఆ వీడియోలు. ఆ మధ్యన ఓనం పండగ సందర్భంగా కొంతమంది యువతులు ఆడిపాడిన 'జిమికి కమల్' వీడియో సంచలనంగా నిలిచింది.
వాళ్లు కేరళ సంప్రదాయ చీరకట్టులో డ్యాన్స్ చేసిన తీరు ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. ఆ భాష, ఆ పాట బొట్టు కూడా అర్థంకాకపోయినా.. విశ్వవ్యాప్తంగా ఆ వీడియోను కోట్లమంది వీక్షించారు. ఆ వీడియోలో నర్తించిన అమ్మాయిలు సెలబ్రిటీలు అయిపోయారు. వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
సోషల్ మీడియాలో వారికి ఫ్యాన్ పేజీలు వెలిశాయి. ఆ పాటలో నర్తించి బాగా ఆకట్టుకున్న వాళ్లను టీవీ ఛానళ్లు తమ స్టూడియోల్లో కూర్చోబెట్టాయి. వాళ్లతో ఇంటర్వ్యూలు తీసుకుని.. ప్రసారం చేసి, టీఆర్పీలు పెంచుకున్నాయి టీవీ ఛానళ్లు. ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అనేందుకు నిర్వచనంగా నిలిచారు జిమికి కమల్ అమ్మాయిలు.
ఇక వాళ్ల గురించి పూర్తిగా మరిచిపోకముందే.. ప్రియాప్రకాష్ వారియర్ వచ్చింది. జిమికి కమల్‌తో పోలిస్తే ఈ అమ్మడిది అస్సలు కష్టంలేదు. జిమికి కమల్ డ్యాన్స్ వీడియో నాలుగైదు నిమిషాల వ్యవధితో ఉంటుంది. అయితే ప్రియా వారియర్ వీడియో మాత్రం సెకన్ల వ్యవధితోనే పాపులర్ అయిపోయింది. ఈమె కన్నుకొట్టిన తీరుకు ప్రపంచం ఫిదా అయిపోయింది. ఏదో సినిమాకు సంబంధించిన టీజర్ ఎవ్వరూ ఊహించనంత సంచలనంగా మారింది.
కోట్ల వ్యూస్‌తో పాటు ఈ వీడియోను అభినందించే వాళ్లు, వివాదంగా మార్చిన వాళ్లు, కోర్టు కేసులు వేసిన వాళ్లు.. ఇలా అంతా ఈ సునామీలో భాగం అయిపోయారు. ఆఖరికి ఈవ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అసలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లడానికి అందులో మేటర్ ఏమీలేదు. వెళ్లిందంతే.. వైరల్‌గా మారిన ఒక వీడియోకు ఉన్న పవర్ అలాంటిది!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మొన్నటి జిమికి కమల్ అయినా, నిన్నటి ప్రియా వారియర్ వీడియో అయినా.. కేరాఫ్ కేరళ. మలయాళ గడ్డమీద నుంచి వచ్చిన వీడియోలే ఇవి. విపరీత స్థాయి సంచలనంగా మారాయి. సోషల్ మీడియా ఇప్పుడు విశ్వవ్యాప్తం. భారత్‌లో కూడా సోషల్ మీడియా వాడకం విపరీత స్థాయిలోనే ఉంది. అయినప్పటికీ.. ఇలాంటి కల్ట్హిట్స్, వైరల్ వీడియోలు.. కేరళ నుంచినే వస్తూ ఉండటం గమనార్హం. కేరళకే ఆ ప్రత్యేకత ఎందుకు? అంటే.. అక్కడ క్యూట్‌నెస్ ఎక్కువ అనేయవచ్చు. అయితే.. అంతకన్నా పెద్ద రీజన్ ఏమిటంటే.. కేరళలో ఇంటర్నెట్ వాడకం మిగతా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల కన్నా చాలా చాలా ఎక్కువ!
జనాభా రీత్యా కేరళ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చిన్నదే. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలతో జనాభాలో పోటీపడలేదు కేరళ. అయినప్పటికీ.. అక్కడ నెటిజన్ల సంఖ్య మాత్రం చాలా చాలా ఎక్కువ. బాగా డెవలప్ అయిపోయాం అని అనుకుంటున్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల కన్నా కేరళలో ఇంటర్నెట్ వాడకందార్లు ఎక్కువమంది ఉన్నారు. ఫలితంగా.. వాళ్లకు సంబంధించినది ఏదైనా ఇంటర్నెట్ మాధ్యమానికి ఎక్కితే ఎక్కువ ప్రచారాన్ని పొందుతూ ఉంటుంది.
ఫలితంగా.. ఇలాంటి వీడియోలు ఏవైనా వచ్చాయంటే.. అవి కేరళ జనాల మధ్యన బ్రహ్మాండమైన ప్రచారాన్ని పొందుతున్నాయి. వారి నుంచి లక్షల, కోట్ల సంఖ్యలో వ్యూస్‌ను కామెంట్లను లైకులను పొందుతూ ఉన్నాయి. వాళ్ల నుంచి మిగతా వాళ్లకు అంటుకుంటూ ఉన్నాయి. అలా ప్రచారం పొందిన వీడియోల్లో నిజంగానే సత్తా ఉండటంతో అవి మలయాళం రాని వాళ్లకు కూడా అంటుకుపోతూ ఉన్నాయి. ఫలితంగా వైరల్ వీడియోస్‌లో కేరళ డ్యామినేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
అప్పుడెప్పుడో ధనుష్ 'త్రీ' సినిమాలోని 'కొలవెరి కొలవెరి ' సాంగ్ సంచలనంగా నిలిచింది. అప్పటికి ఇంటర్నెట్ ఇంతస్థాయిలో అనుబంధానమై లేదు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు విపరీత స్థాయికి పెరిగింది. అక్కడికీ ధనుష్ అప్పటికే పక్కరాష్ట్రాల వాళ్లకు పరిచయస్తుడే. అతడికి హీరోగా పాపులారిటీ ఉంది కాబట్టి.. అతడి వీడియో మరింత పాపులర్ అయ్యింది. అయితే కేరళ నుంచి వస్తున్న వీడియోలు మాత్రం అనామకులవి.
మోహన్‌లాల్ సినిమా ఒక దాంట్లోని పాట అయిన 'జిమికి కమల్'కు డ్యాన్స్ చేసిన వాళ్లంతా అనామకులే. ఏదో ఓనం సందర్భంగా వాళ్లు సరదాగా ఆ పనిచేశారు. ఆ డ్యాన్స్‌లో ఒకరిద్దరు యువతుల క్యూట్‌నెస్‌కు ముందుగా కేరళ జనాలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మిగతావాళ్ల వంతు. కోట్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
ఈపాట ఎంత కల్ట్ హిట్ అయ్యిందంటే.. వీళ్లు ఆ పాటకు డ్యాన్స్ చేసిన తీరుతో.. మోహన్‌లాల్ సినిమాలో ఆ పాటకు ఉన్న డ్యాన్స్‌తో పోలిక వచ్చింది. సినిమాలో ఆ పాట చిత్రీకరణ తీరు.. వీళ్లముందు నిలబడలేకపోయింది. దీంతో ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. సినిమాలోని ఆ పాటనూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. బయటవాళ్లు చేసిన డ్యాన్స్ కంపోజిషన్‌కు మాత్రం కోటాను కోట్లవ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు ప్రియా వారియర్ హవా కొనసాగుతూ ఉంది. ప్రియా వారియర్ నటించిన సదరు సినిమా టీజర్‌కు ఇంత పాపులారిటీ వచ్చిందని చెప్పి.. ఆ సినిమా కూడా హిట్ అవుతుందనే బలం ఏమీలేదు. సినిమా సినిమానే వైరల్ వీడియోలు వైరలే అని వేరే చెప్పనక్కర్లేదు. కానీ.. సదరు సినిమాకు మాత్రం ఇప్పుడు బ్రహ్మాండమైన మార్కెట్ దక్కే అవకాశం ఉంది. ప్రియా వారియర్‌ను చూడటానికి అనేకమంది థియేటర్లకు క్యూలు కట్టవచ్చు.
ఎలాగూ టీనేజ్ లవ్‌స్టోరీలా అగుపిస్తోంది కాబట్టి 'ఒరు ఆధార్ లవ్' అనే ఆ సినిమా ఇతర భాషల్లో కూడా ఆదరణకు నోచుకోవచ్చు. ఆ సినిమాను తమిళులు, తెలుగు వాళ్లు కూడా డబ్బింగ్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా గనుక ఆ సినిమా ఆకట్టుకుంటే.. కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఉత్తిపుణ్యానికి, ఇంటర్నెట్ ద్వారా ఇంత పాపులారిటీ అంటే.. అది లక్కేకదా. కేరళలో ఉన్న బలమైన ఇంటర్నెట్ బేస్ ఫలితంగానే ఇలాంటి గుర్తింపు దక్కుతోందని చెప్పాలి.
ఇవేకాదు.. 'ప్రేమమ్' సినిమా తెలుగు వరకూ రాకముందే.. బ్రహ్మాండమైన ప్రచారాన్ని సొంతం చేసుకుంది. మలయాళ వెర్షన్‌కే మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా హీరో ఎవరో తెలీదు, అందులో నటించిన నటీమణులకూ అంత గుర్తింపులేదు. కేరళలో ఆ సినిమా హిట్కావడం, దానికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లోకి షేర్కావడంతో.. ఆ సినిమాకు తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ముందస్తుగానే విపరీతమైన ప్రచారం దక్కింది.
ఆ సినిమాకు సంబంధించిన టీజర్లు, సినిమాలోని పాటలు, హీరోహీరోయిన్ల ఎక్స్ప్రెషన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇదంతా ఇంటర్నెట్ పుణ్యమే. తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన అనేక సినిమాలు హిట్ అవుతున్నా.. వీటితో పోలిస్తే.. మలయాళంలో గుర్తింపుకు నోచుకున్న సినిమాలు.. ప్రత్యేకించి యువతరాన్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు, వీడియోలు.. ఇంటర్నెట్లో సంచలనంగా మారుతున్నాయి.
సోషల్ మీడియాలో జనాలు వ్యవహరించే తీరు కూడా ఇక్కడ ముఖ్యమే. వీడియోలను షేర్ చేసుకోవడానికి, వైరల్‌గా మార్చడానికి.. మిగతావాళ్లతో పోలిస్తే తెలుగువాళ్లు సపరేట్. మనోళ్లు మరీ వాటికి పబ్లిసిటీలు కల్పించడానికి ఇష్టపడరు. వేరే వాళ్లతీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకించి మలయాళీలు మరింత ప్రత్యేకం. అందుకే.. వారి వ్యవహారాలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సంచలనాలు అవుతున్నాయి.