‘వంద’ కోట్లకు వందనం

అసలు లెక్కలు తెలియక పోయినా, డెభై కోట్లు, ఎనభై కోట్లు, వంద కోట్లు అంటూ లెక్కలు కోట్లు దాటించిన సినిమా అత్తారింటికి దారేది.  అసలు ఎన్ని కోట్లు సాధించింది అన్నది పక్కన పెడితే, సరైన…

అసలు లెక్కలు తెలియక పోయినా, డెభై కోట్లు, ఎనభై కోట్లు, వంద కోట్లు అంటూ లెక్కలు కోట్లు దాటించిన సినిమా అత్తారింటికి దారేది.  అసలు ఎన్ని కోట్లు సాధించింది అన్నది పక్కన పెడితే, సరైన సినిమా పడిదే వంద కోట్లు కష్టం కాదు అని ఓ ధైర్యాన్ని ఇచ్చింది ఆ సినిమా.  

ఆ తరువాత మహేష్ బాబు-శ్రీనువైట్ల ఆగడు వస్తుంటే వంద కోట్లు గ్యారంటీ అనుకున్నారు. కానీ అది వంద కోట్లకు వంద కిలోమీటర్ల దూరంలో ఆగిపొయింది.  అంతకు ముందు వన్ గురించి కూడా అలాగే అనుకున్నారు.  అయితే ఏ మాటకు ఆ మాట, మహేష్ సినిమా హిట్ కావాలే కానీ వంద కోట్లు కష్టం కాదు. కానీ హిట్ అన్నదే కరువైంది. 

సరే పవన్-వెంకీల కాంబినేషన్ 'గోపాల గోపాల‌' వస్తోంది..ఆ రేంజ్ వుంటుందా అనుకున్నారు. క్లాస్ సినిమా వుండదనీ అనుకున్నారు. రెండేదే నిజమయింది. ఇక డబ్బింగ్ సినిమా అయినా శంకర్ అందించిన ఐ ఏమన్నా ఊపేస్తుందేమో అనుకున్నారు. 36 కోట్లకు పైగా ఖర్చు చేసి తెలుగునాట విడుదల చేసారు. దానికీ ఆ సీన్ లేదని తేలిపోయింది. 

ఇక మిగిలింది ప్రభాస్-రాజమౌళిల బాహుబలి ఒక్కటే. మగధీరతో రికార్డు సృష్టించిన జక్కన్న మళ్లీ కొత్త రికార్డు సృష్టిస్తారేమో చూడాలి మరి.