ఎప్పడో పవన్ కళ్యాణ్ తీన్ మార్ లో చూసాం..వారణాసి నేపథ్యంలో ప్రేమకథను. మళ్లీ మరోసారి వారణాసి బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇటీవల సాక్ష్యం, గూఢచారి సినిమాలు అందించిన అభిషేక్ పిక్చర్స్ ఓ సినిమాను పూర్తిగా వారణాసి బ్యాక్ డ్రాప్ లో నిర్మించబోతోందట. ప్రవీణ్ కుమార్ అనే దర్శకుడు చెప్పిన ప్రేమకథ కోసం పాపులర్ యంగ్ హీరో కోసం ట్రయ్ చేస్తున్నారట. ఓకె కాగనే ప్రాజెక్ట్ డిటైల్స్ అనౌన్స్ చేస్తారు.
ఇంతకీ ఈ ప్రవీణ్ కుమార్ ఎవరోకాదు. గతంలో గాయం 2, కాళీచరణ్ అనే సినిమాలు అందించిన దర్శకుడే. ఈ కథ, పాయింట్ బాగుండడంతో అవకాశం ఇస్తున్నారట. వాస్తవానికి వారణాసి లాంటి లోకేషన్ చాలా బాగుంటుంది. ఆ అట్మాస్ఫియర్, లుక్ అంతా డిఫరెంట్ గా వుంటుంది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అంటే కాస్త బాగానే వుంటుంది.
అయినా ముందు విషయం బాగుండాలి. ఆపై డైరక్టర్ స్టామినా వుండాలి. అప్పుడు ఏ లొకేషన్ అయినా సూపరే. అన్నట్లు సాక్ష్యం సినిమాలో అన్నింటికన్నా వారణాసి లోకేషన్ లో తీసిన సీన్ నే హైలైట్ అయింది. ఆ సినిమాకు అదే సమస్య. విషయం బాగుంది. దాన్ని డీల్ చేసే స్టామినా డైరక్టర్ కు కరువైంది. ఈసారి అయినా అభిషేక్ నామా ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.