ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇటు బాలయ్య కానీ, అటు రామ్ గోపాల్ వర్మ కానీ పెదవి విప్పలేదు. కానీ ఒక విధంగా ఆలోచిస్తే బయోపిక్ ఆగిపోయిందన్నది వాస్తవంగానే కనిపిస్తోంది.
ఈ మధ్యనే వర్మ శిష్యుడు పూరిజగన్నాధ్ లేటెస్ట్ మూవీ పైసా వసూల్ ట్రయిలర్ వచ్చింది. పైగా ఈ సినిమాలో హీరో బాలకృష్ణ. మరి అలాంటపుడు వర్మ ఈపాటికే రెచ్చిపోయి, ఈ ట్రయిలర్ పై ప్రశంసలు కురిపించాల్సి వుంది. కానీ అలాంటి జాడలు ఎక్కడా కనిపించలేదు.
మామూలుగా ఎవరు హీరో అయినా, అది పూరి సినిమా అయితే వర్మ ప్రశంసించకుండా వుండరు. పైగా బయోపిక్ ప్రాజెక్టు కనుక ఇంకా సజీవంగా వుండి వుంటే, బాలయ్య హీరో కాబట్టి, ఓ రేంజ్ లో మోసేసే ప్రయత్నం వర్మ చేసి వుండేవారు. కానీ ఈ రెండు వైనాలు కనిపించ లేదు. అంటే ఎన్టీఆర్ బయోపిక్ అది కూడా వర్మ డైరక్షన్ లో అన్న ఆలోచన అటక ఎక్కేసింది అన్న వార్తలు నిజమే అని రూఢి అవుతోంది.
ఒక విధంగా మంచిదేమో అన్న కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. జీవిత చరమాంకంలో రెండో వివాహం మినహా మరే విధమైన ఎత్తి చూపే పాయింట్ లేకుండా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి జీవిత చరిత్రను రూపొందించే, వర్మకు, ఆయనతో కాలక్షేపం చేసే శిష్య బృందానికి అప్పగిస్తే ఏం జరుగుతుందో, గడచిన నాలుగైదు ఏళ్లుగా వచ్చిన సినిమాలే చెపుతాయి. అవే పాటలు, అవే కేకలు, అవే షాట్ లు. అందువల్ల బయోపిక్ ఆగిపోవడమే మంచిదని కామెంట్ లు వినిపిస్తున్నాయి.