ప్రియమైన వర్మగారూ!
ఆదివారం నాటి వ్యవహారాల మీద మీ ట్వీట్లను చూసి చాలా ముచ్చటేసింది. సెలబ్రిటీ హోదాలో ఉన్న వారు.. సామాజికాంశాలను కూడా పట్టించుకుంటూ, ప్రతిస్పందిస్తూ ఉండడం బహు అరుదు! ఎప్పుడో గానీ జరగదు. అలాంటిది దేశవ్యాప్త సెలబ్రిటీ అయిన మీరు పోర్న్ సైట్ల నిషేధ వ్యవహారంపై మీ నిశ్చితమైన అభిప్రాయాలను వెల్లడించడం చాలా సంతోషకరం. అనధికారికంగానే కావొచ్చు గానీ.. ఈ వెబ్సైట్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతూ… ఇది వ్యక్తిస్వేచ్ఛను హరిస్తున్నదని మీరు వ్యక్తం చేసిన ఆవేదనను జాతి అర్థం చేసుకుంటున్నది. ఈ దేశపు యువతరం కోసం మీ ఆరాటాన్ని జాతి అవగతం చేసుకుంటున్నది. పాపం.. యువకులంతా ఏమైపోవాలి… సినిమాల్లో బూతును ప్రదర్శిస్తే.. సెన్సార్‌లో బ్లర్ చేసేసి వేస్తున్నారు.. పోర్న్ వీడియో కేసెట్లు, సీడీలు అమ్ముకునే రోజులు మారిపోయాయి. ఇప్పుడంతా ఇంటర్నెట్ అయిపోయింది. పాత ఏర్పాట్లు అన్నీ పాతరేసేసాక.. ఇప్పుడీ ఇంటర్నెట్లకూ నిషేధం పెట్టేస్తే.. మన భారత జాతి యువతరం.. తమ బూతు ఆవేశాలను చల్లార్చుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలి.. ఏ మాధ్యమం మీద డిపెండ్ కావాలి? వారి బాధను, ఆరాటాన్ని అర్థం చేసుకునేది, ప్రత్యామ్నాయ మార్గం చూపించేది ఎవరు? పాత్రను మీరు పోషిస్తున్నందుకు, బాధ్యతను భుజానికెత్తుకున్నందుకు చాలా సంతోషం.
సాధారణంగా సెలబ్రిటీ ఎక్కువగా సినీ, రాజకీయ, స్పోర్ట్స్ రంగాల్లోనే ఉంటారు. వీరిలో రాజకీయ నాయకులు మాత్రమే ప్రజల గురించి పట్టించుకుంటున్నట్లుగా కనిపిస్తుంటారు. మిగిలిన రెండు రంగాల వారు ప్రజల గురించి పట్టించుకోరు. తమ పని తాము చేసుకోవడం మీదనే దృష్టిపెడతారు. మీరు అలా కాదు. ప్రపంచం బాధ నా బాధ అని భావించే శ్రీశ్రీ టైపు మీరు. నిన్నటినుంచి పోర్న్ సైట్లు ఓపెన్ కాకపోవడం వల్ల అల్లాడిపోతున్న యువతరం కన్నీళ్లకు ప్రతిబింబంగా మీరు వెళ్లగక్కిన ఆవేశం సబబుగానే ఉంది.
అయినా పోర్న్ వెబ్సైట్లు నిషేధిస్తే మాత్రం ఏమైంది. మీ చిత్రాల్లో కొన్నింటికి డీవీడీ మార్కెట్ పెరుగుతుంది. ఒక రకంగా మీరు అందుకు సంతోషించాలి. బహుశా మీరు చేసిన ఆయా చిత్రాల నిర్మాతలు సంతోషిస్తుండవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే.. నిరంకుశ ప్రభుత్వం అనధికారికంగా పోర్న్ సైట్లను నిషేధించడంలో వ్యక్తిస్వేచ్ఛను హరించడం అవుతుందని మీరు జాతికి తెలియజెప్పి మంచి పనిచేశారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే.
ఈ దేశం మరికొన్ని ప్రాథమిక హక్కులను కూడా హరించేస్తున్నది. పోర్న్ వెబ్సైట్ల మాదిరిగానే పోర్న్ టీవీ ఛానెళ్లకు అనుమతిస్తే ఈ దేశంలో ఎంత రెవెన్యూ పెరుగుతుంది. ప్రభుత్వం ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. టీవీ ఛానెల్లో ప్రసారం చేసే కంటెంట్ అన్నది రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కుల్లో ఒకటైన వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరం అని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అలాగే సినీమాలకు కూడా సెల్ఫ్ సెన్సారింగ్ విధానమే ఉండాలి. మీ లాంటి సృజనాత్మక దర్శకులు బట్టలకు కత్తెర్లు వేసేసిన తర్వాత.. మళ్లీ సెన్సారు వారు ఫిల్ముకు కత్తెర వేయడం ఎంత దారుణం. ఈదేశంలో మన చెప్పదలచుకున్న భావాలను మనల్ని చెప్పుకోనివ్వరా..? పోర్న్ సైట్ల విషయంలో మీరన్నట్లుగా.. తాలిబన్, ఐసిస్లాగా.. మోడీ సర్కారు కూడా స్వేచ్ఛల్ని హరించేస్తోంది.
అందుకే మీరు మరిన్ని ట్వీటు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. సన్నద్ధులు కండి.. నిన్నటినుంచి ఆరాటంలో తహతహ లాడిపోతున్న.. డ్రగ్ అందకుండా పోయిన ఎడిక్ట్ లాగా వెర్రెత్తిపోతున్న యువభారతం మొత్తం మీ వెంట నిలుస్తుంది.
– సురేష్