విజయ్‌… ఇరవై సంవత్సరాల కల నెరవేరినట్టేనా..!

మిగతా తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులోకి అనువదించి హిట్లు కొడుతూనే ఉన్నారు. అయితే డబ్బింగ్‌ సినిమాలను అమితంగా ఆదరించే తెలుగు సినీ ప్రేక్షకులకు విజయ్‌ సినిమాలు మాత్రం ఎక్కలేదు ఇంతవరకూ. తమిళంలో సంచలన…

మిగతా తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులోకి అనువదించి హిట్లు కొడుతూనే ఉన్నారు. అయితే డబ్బింగ్‌ సినిమాలను అమితంగా ఆదరించే తెలుగు సినీ ప్రేక్షకులకు విజయ్‌ సినిమాలు మాత్రం ఎక్కలేదు ఇంతవరకూ. తమిళంలో సంచలన విజయాలు సాధించిన విజయ్‌ సినిమాలు ఒక్కొక్కటిగా తెలుగులోకి డబ్‌ కావడం.. తిరుగుటపా కట్టేయడం.. ఇలాగే జరుగుతోంది. ఇప్పుడు కాదు.. తెలుగునాట తమిళ డబ్బింగ్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ మొదలైన గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదే పరంపర. ఒక్కటంటే ఒక్కటి కూడా.. హిట్‌ అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది.

తమిళంలో అనామకులు అయిన హీరోల సినిమాలు కూడా తెలుగునాట హిట్టైన సందర్భాలు ఉన్నాయి కానీ.. విజయ్‌ సినిమాలకు మాత్రం ఆ ముచ్చట మిగల్లేదు. అయితే ఎట్టకేలకూ 'అదిరింది' ఆ లోటును తీర్చినట్టే అని అనుకోవాలి. మరీ సూపర్‌హిట్‌ కాదు కానీ, ఫర్వాలేదు.. కమర్షియల్‌గా చూసుకుంటే ఈ సినిమా హిట్ట్‌ అయినట్టే అని ట్రేడ్‌ ఎనలిస్టులు చెబుతున్నారు. ఎట్టకేలకూ విజయ్‌కి ఒక హిట్టు దక్కినట్టే అంటున్నారు.

అయితే విజయ్‌కి ఇది తెలుగునాట తొలి హిట్టే కానీ, విజయ్‌ సినిమాలకు మాత్రం ఇది తొలిహిట్టు కాదు. ఇదివరకూ విజయ్‌ సినిమాలు తెలుగునాట సంచలన విజయాలు నమోదు చేశాయి. ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఇదంతా.. తెలుగునాట జరిగిందే. అయితే వాటిల్లో విజయ్‌ హీరో కాదు.. కానీ అవి విజయ్‌ సినిమాలే! విజయ్‌ తమిళంలో నటించగా.. సూపర్‌ హిట్‌ అయిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి.

అయితే విజయ్‌ రీమేక్‌తో కాకుండా.. డబ్బింగ్‌తో వచ్చినప్పుడే తేడా కొడుతూ వచ్చింది వ్యవహారం. తమిళ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఆకట్టుకునే రూపం ఏదీ లేకుండానే హీరో అయిపోయిన విజయ్‌.. సెకెండ్‌ హీరో తరహా పాత్రలతో మొదలుపెట్టి.. స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇతడు సెకెండ్‌ హీరోగా నటించిన నాటి నుంచినే ఆ సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతూ వచ్చాయి. అయితే ఎవరి నోటీస్‌లోకీ రాలేదు.

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, విజయ్‌కాంత్‌ల తర్వాత.. తెలుగునాట 2000-03 మధ్యకాలంలో సూర్య, విక్రమ్‌, శింబులు సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. అంతకు ముందే అజిత్‌, మాధవన్‌ వంటి తమిళ హీరోలు తెలుగునాట ఒకటీ రెండు హిట్లను కొట్టారు. వాళ్లకు క్రేజ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత విక్రమ్‌, సూర్య, శింబు, విశాల్‌ లాంటి వాళ్లు దూసుకు వచ్చారు తమిళనాడు నుంచి. అదే దశలో తమిళంలో స్టార్‌ హీరోగా చలామణి అయిన విజయ్‌ కూడా వాళ్లతో పాటు వచ్చాడు. వివిధ సినిమాలు వరసపెట్టి డబ్‌ అవుతూనే ఉన్నాయి. ఇరవై యేళ్ల నుంచి విజయ్‌ సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి, గత పదిహేనేళ్లలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి వెళ్లాయి.

విజయ్‌ సినిమాలు రీమేక్‌ అయితే  హిట్టే!

తమిళం నుంచి అనువాదం అవుతూ వచ్చిన విజయ్‌ సినిమాలు తెలుగునాట హిట్లను కొట్టలేకపోయాయి కానీ, విజయ్‌ తమిళంలో చేసిన పలు సినిమాలు తెలుగునాట రీమేక్‌ అయ్యి సంచలన విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. వీటిల్లో కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌ను కొట్టినవి కూడా ఉన్నాయి. సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. 'శుభాకాంక్షలు' నుంచి 'ఖైదీ 150' వరకూ ఈ జాబితాలో ప్రముఖమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

ఫస్ట్‌ హిట్‌.. శుభాకాంక్షలు!

తమిళంలో సోలో హీరోగా విజయ్‌ నమోదు చేసిన తొలి సూపర్‌ హిట్‌ ఈ సబ్జెక్టే. తమిళంలో ఈ సినిమా హిట్‌ అయిన తీరును చూసి తెలుగులో జగపతిబాబు చేత ఈ సినిమాను రీమేక్‌ చేయించారు సూపర్‌ గుడ్‌ఫిల్మ్స్‌ వాళ్లు. తెలుగునాట శుభాకాంక్షలు సంచలన విజయం సాధించింది. కొన్ని థియేటర్లలో నాలుగువందల రోజుల లాంగ్‌ రన్‌ను సాధించిందంటే.. ఆ సినిమా ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి పాటలు ఆ సినిమాను సంచలన స్థాయికి తీసుకెళ్లాయి. జగపతిబాబుకు మరపురాని విజయం ఇచ్చిన ఈ సినిమా అసలు హీరో విజయ్‌!

పవన్‌ కల్యాణ్‌ చేత ఖాతా తెరిపించాడు…

'సుస్వాగతం' పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో తొలి సూపర్‌హిట్‌ అనాలి. తమిళంలో విజయ్‌ హీరోగా నటించిన 'లవ్‌ టుడే' సినిమాకు రీమేక్‌ గానే 'సుస్వాగతం' వచ్చింది. తెలుగునాట సూపర్‌ హిట్‌ అయ్యింది. 

నాగార్జునకు ఒక హిట్‌ ఇచ్చిన విజయ్‌!

'నువ్వు వస్తావని' ఇది నాగార్జున కెరీర్‌లో మరిచిపోలేని హిట్‌ సినిమా. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీగా వచ్చిన ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా తెలుగునాట సంచలనంగా, మరపురాని సినిమాగా నిలిచింది. దీని ఒరిజినల్‌లో కూడా విజయ్‌ హీరోగా నటించాడు. విజయ్‌ చేసిన పాత్రనే నాగార్జున చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

పవన్‌ కల్యాణ్‌కు బాగా అచ్చివచ్చాడు!

లవ్‌ టుడేని పవన్‌ కల్యాణ్‌ 'సుస్వాగతం'గా రీమేక్‌ చేసి విజయం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత విజయ్‌ చేసిన 'ఖుషీ'ని అదే పేరుతో పవన్‌ కల్యాణ్‌ రీమేక్‌ చేశాడు. ఆ సినిమా పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లోనే అప్పటికి టాప్‌ హిట్‌గా నిలిచింది. ఆ విధంగా పవన్‌కు విజయ్‌ బాగా అచ్చి వచ్చాడు. అనంతర కాలంలో విజయ్‌ చేసిన ఒక తమిళ సినిమానే పవన్‌ కల్యాణ్‌ 'అన్నవరం'గా రీమేక్‌ చేశాడు. ఇది మాత్రం జస్ట్‌ యావరేజ్‌గా నిలిచింది.

ఇతర హీరోలు కూడా…

సుమంత్‌ హీరోగా వచ్చిన 'గౌరీ' సినిమా ఆ హీరో నటించిన యావరేజ్‌ సినిమాల్లో ఒకటి. దీనికి మూలం కూడా విజయ్‌ తమిళంలో చేసిన సినిమానే. ఇక కల్యాణ్‌రామ్‌ 'విజయదశమి' అంటూ విజయ్‌ సినిమా ఒకదాన్ని రీమేక్‌ చేశాడు కానీ అది అంతగా ఆడలేదు. నాగార్జున, సుమంత్‌ హీరోలుగా నటించిన 'స్నేహమంటే ఇదేరా' సినిమాకు తమిళంలో విజయ్‌-సూర్యలు చేసిన 'ఫ్రెండ్స్‌' సినిమానే మూలం. ఇదే సినిమా ముందుగా మలయాళంలో 'ఫ్రెండ్స్‌' పేరుతోనే రూపొందింది.

మెగాస్టార్‌ రీఎంట్రీకి విజయ్‌ సినిమానే…

తనకన్నా చాలా సీనియర్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవికి కూడా రీమేక్‌కు తగిన సినిమాను ఇచ్చాడు విజయ్‌. చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ 150'కి మూలం విజయ్‌ తమిళంలో చేసిన 'కత్తి' సినిమానే అని వేరే వివరించనక్కర్లేదు. ఈ రీమేక్‌ తెలుగులో సంచలన విజయం సాధించింది.

ఇలా విజయ్‌ సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యి సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇతర తమిళ హీరోల సినిమాలు తమిళం నుంచి డైరెక్టుగా తెలుగులోకి అనువాదం అవుతూ హిట్లను పొందితే విజయ్‌కి చాలాకాలం పాటు ఆ లక్‌ కలిసి రాలేదు. ఇతడి సినిమాలు కొన్ని తెలుగులో రీమేక్‌ అయ్యి విజయాలు సొంతం చేసుకుంటున్నా, డబ్బింగ్‌లు మాత్రం ఫెయిల్యూర్స్‌ గానే నిలిచాయి. ఆఖరికి శంకర్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'త్రీ ఇడియట్స్‌' రీమేక్‌ కూడా తెలుగులోకి డబ్‌ అయ్యి ఫెయిల్యూర్‌ గానే నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో 'మెర్సల్‌' మాత్రం మినహాయింపు పొంది.. కమర్షియల్‌గా 'అదిరింది'.