బిచ్చగాడు అనే ఒకేఒక్క సినిమా హిట్ అవ్వడంతో.. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ పైకి దండెత్తడం స్టార్ట్ చేశాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు ఇక్కడ హిట్ అయింది కాబట్టి, దానిపేరు చెప్పి తన సినిమాలకు బాగానే మార్కెట్ చేసుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి బిచ్చగాడు టాపిక్కే.
ఆ మాయలో పడి కోట్లుపెట్టి విజయ్ ఆంటోనీ సినిమాలు కొన్నారు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కానీ బిచ్చగాడు తర్వాత అన్నీ ఫ్లాపులే. తాజాగా విడుదలైన ఇంద్రసేన సినిమాతో సహా.
ఇంద్రసేన థియేట్రికల్ రైట్స్ ను 2కోట్ల 30లక్షల రూపాయలకు కొన్నారు. కానీ మొదటివారం గడిచేసరికి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. ఈ 7రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ కేవలం 55లక్షలు మాత్రమే. అంటే పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా రాలేదన్నమాట.
ప్రస్తుతం ఈ సినిమా అక్కడక్కడ ఆడుతున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు విజయ్ ఆంటోనీ నటించిన భేతాళుడు, యమన్ సినిమాలు కూడా ఇక్కడ ఫ్లాప్ అయ్యాయి. ఇంద్రసేనతో ఈ హీరో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టినట్టయింది.